Mahesh Kumar Goud | జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికో క్లారిటీ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ నాయకుడికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారు.

Mahesh Kumar Goud | జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికో క్లారిటీ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్, అక్టోబర్‌ 6 (విధాత ప్రతినిధి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ నాయకుడికే టికెట్ వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షులు బీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశముందన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఔత్సాహిక అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేష్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ముగ్గురు ఇన్‌చార్జ్‌ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, జీ వివేక్ వెంకటస్వామి రిపోర్టు ఆధారంగా అభ్యర్ధి ఎంపిక ఉంటుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన విధంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని మహేశ్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. అభివృద్ది, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విషయంలో మంత్రి పొన్నం వ్యాఖ్యలను వక్రీకరించారని, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులు అన్ని భర్తీ చేస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ముందే ఊహించామన్నారు. బీసీ డిక్లరేషన్ అమలుపై త్వరలోనే కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌లో బస్తీ బాట చేపట్టి, ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. స్థానిక పరిస్థితుల బట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామన్నారు. ఎంఐఎం మద్దతు విషయమై చర్చించాల్సి ఉందని మహేష్ గౌడ్ అన్నారు.