ఉత్త‌ర గాజాలో ఘోరం.. ఆసుప‌త్రిపై రాకెట్ దాడి, 500 మంది మృతి

ఉత్త‌ర గాజాలో ఘోరం.. ఆసుప‌త్రిపై రాకెట్ దాడి, 500 మంది మృతి
  • తాము కాదంటున్న ఇజ్రాయెల్‌.. హ‌మాస్ రాకెట్ దారిత‌ప్పింద‌ని ప్ర‌క‌ట‌న‌
  • ప్ర‌పంచ‌దేశాల దిగ్భ్రాంతి


ఇజ్రాయెల్ – హ‌మాస్ (Israel – Hamas) పోరులో మంగ‌ళ‌వారం ఘోర దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఉత్త‌ర గాజాలోని ఓ ఆసుప‌త్రిపై రాకెట్ దాడి జ‌రిగింది. దీంతో అక్క‌డ భారీ పేలుడు చోటు చేసుకుని క‌నీసం 500 మంది మృత్యువాత ప‌డ్డారు. అహ్లీ బాప్టిస్ట్ అనే ఈ ఆసుప‌త్రి (Rocket on Hospital) పై ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు బాంబులు జార‌విడిచాయ‌ని గాజా ఆరోగ్య శాఖ మంత్రి త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.


ఆసుప‌త్రిపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించాల‌ని అర‌బ్‌, ఇస్లామిక్ దేశాల‌కు హ‌మాస్ నాయ‌కుడు ఇస్మాయిల్ హ‌నీయాహ్ పిలుపునిచ్చారు. త‌మ దాడుల్లో కూలిపోయే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి వెంట‌నే ఖాళీ చేయాల‌ని ఇజ్రాయెల్ ఇచ్చిన స‌మాచారం ఈ ఆసుప‌త్రికీ వ‌చ్చింద‌ని.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.


 అయితే నిరాశ్ర‌యులు, రోగులు క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్నార‌ని పేర్కొంది. మ‌రోవైపు ఈ దాడిని తాము చేప‌ట్టామ‌న్న వార్త‌ల‌ను ఇజ్రాయెల్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించింది. పాల‌స్తీనియ‌న్ ఇస్లామిక్ జిహాద్ సంస్థ ప్ర‌యోగించిన రాకెట్ విఫ‌ల‌మై ఈ ఘోరం చోటుచేసుకుంద‌ని పేర్కొంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో గాజా నుంచి పెద్ద సంఖ్య‌లో రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చాయ‌ని వెల్ల‌డించింది.


ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మ‌న్ నెత‌న్యాహూ సైతం ఈ దాడిని ఖండించారు. గాజాలో ఉగ్ర‌వాదుల హింస ప‌తాక‌స్థాయికి చేరుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పిల్ల‌ల‌ను నిర్దాక్షిణ్యంగా పొట్ట‌న పెట్టుకున్న వారే.. వారి పిల్ల‌ల‌నూ వ‌ద‌ల‌ట్లేద‌ని వ్యాఖ్యానించారు. దాడి గాజా వైపు నుంచే జ‌రిగిందనే వాద‌న‌ను బ‌ల‌ప‌రిచేలా ఇజ్రాయెల్‌కు చెందిన ప‌లు ఎకౌంట్లు వీడియోల‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాయి.


ఈ మార‌ణ‌హోమంపై ప్ర‌పంచ‌దేశాల నాయ‌కులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రాకెట్ దాడిపై ద‌ర్యాప్తు అవ‌స‌ర‌మ‌ని జ‌ర్మ‌న్ ఛాన్స్‌ల‌ర్ ఓలాఫ్ స్కాల్జ్ సూచించారు. ఘ‌ట‌న క‌ల‌చివేసింద‌ని పేర్కొన్నారు. ఈ దాడి చేసింది తాము కాద‌ని చెబుతున్న ఇజ్రాయెల్‌.. దానిని బ‌ల‌ప‌రిచేలా శాటిలైట్ చిత్రాల‌ను బహిరంగంగా విడుద‌ల చేయాల‌ని ర‌ష్యా విదేశాంగ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


కాగా ఈ నెల ఏడో తేదీ నుంచి మొద‌లైన ఈ హింస ఇరువైపులా కొన్ని వేల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇజ్రాయెల్‌లో 1400 మంది మ‌ర‌ణించ‌గా.. పాల‌స్తీనా వైపు 3000 మంది మ‌ర‌ణించారు. ఇరు వ‌ర్గాలూ కాల్పుల విర‌మ‌ణ చేయాల‌ని పేర్కొంటూ యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లిలో ర‌ష్యా ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి మ‌ద్ద‌తు రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌మాస్ దాడిని ర‌ష్యా ఖండించ‌క‌పోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది.


ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాగా.. బ్రిట‌న్ ప్ర‌ధాని రుషీ సునాక్ కూడా ఇజ్రాయెల్ రానున్నారు. వీరి ప‌ర్య‌ట‌న‌ల ప్ర‌ధాన ఉద్దేశం ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డ‌మే అయిన‌ప్ప‌టికీ.. పాల‌స్తీనా వాసులకు సుర‌క్షిత కారిడార్లు ఏర్పాటు చేసేలా చ‌ర్చ‌లు చేస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.