కొడుకును విడిపించడం కోసం న్యాయవాదిగా మారిన 90 ఏళ్ల వృద్ధురాలు
చైనాలో 90 ఏళ్ల తల్లి తన కుమారుడిని రక్షించుకునేందుకు స్వయంగా న్యాయశాస్త్రం నేర్చుకుని కోర్టులో వాదనలు వినిపించిన అరుదైన సంఘటన. రూ.141 కోట్ల దోపిడీ కేసులో జెజియాంగ్ ప్రావిన్స్ కోర్టులో కొనసాగుతున్న ఈ విచారణ తల్లీ మమకారం, పట్టుదల, ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియేట్ కోర్టు ప్రస్తుతం ఒక అరుదైన సంఘటనకు వేదిక అయింది. అక్కడ నిందితుడి స్థానంలో ఉన్న వ్యక్తి లిన్ (57), అతని పక్కన న్యాయవాదుల సీట్లో వయసు ముదిరిన ఒక తల్లి – ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ వృద్ధురాలు హే గారు తన కుమారుడిని రక్షించుకునేందుకు స్వయంగా న్యాయశాస్త్రం నేర్చుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ సంఘటన చైనా మీడియా, ఇంటర్నెట్ అంతటా చర్చనీయాంశమైంది.
కేసు నేపథ్యం
2023 ఏప్రిల్‌లో లిన్‌ను స్థానిక పారిశ్రామికవేత్త హువాంగ్‌పై బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. లిన్ మరియు హువాంగ్ ఇద్దరూ గ్యాస్ ఉత్పత్తి వ్యాపారంలో భాగస్వాములు. 2009లో హువాంగ్ చైనాలో అత్యంత ధనవంతుల టాప్ 100 జాబితాలో ఉండి, ఎనిమిది బిలియన్ యువాన్ (1.1 బిలియన్ అమెరికన్ డాలర్లు) నికర ఆస్తి కలిగి ఉన్నాడు. అయితే వ్యాపార భాగస్వామ్యంలో అతను తరచుగా చెల్లింపులను ఆలస్యం చేయడం వల్ల లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోయి తీవ్ర నష్టాలు వచ్చాయి.
2014 నుండి 2017 మధ్యలో, లిన్ మరియు అతని అకౌంటెంట్, హువాంగ్ అక్రమ వ్యాపార పద్ధతులను పన్ను అధికారులకు చెప్పేస్తామని బెదిరించి, మొత్తం 117 మిలియన్ యువాన్ (రూ.141 కోట్లు) వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులు విసుగుచెందిన హువాంగ్ 2023 ఆరంభంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లిన్‌పై ఎక్స్‌టోర్షన్ కేసు నమోదు అయింది.
తల్లీ మమకారం – న్యాయపథంలో అడుగులు
తన కుమారుడిని కోర్టులో హ్యాండ్‌కఫ్స్ వేసి తీసుకువస్తున్న దృశ్యం హే మనసును కుదిపేసింది. ఆ క్షణంలోనే ఆమె కన్నీటి పర్యంతమై, గుండె నొప్పితో కూర్చున్నట్లు అయ్యింది. కోర్టు అధికారులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ ఆమె ఒక్క మాట – “నా కుమారుడి పక్కనే ఉంటాను” అని చెప్పి వెళ్లడానికి నిరాకరించారు.
గత సంవత్సరం నుంచి క్రిమినల్ లా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ లా పుస్తకాలు కొనుగోలు చేసి, స్వయంగా చదవడం ప్రారంభించారు. పుస్తకాలతో పాటు న్యాయ పత్రికలు, కేసు చరిత్రలూ అధ్యయనం చేశారు. అంతే కాదు, రోజూ కోర్టుకి వెళ్లి సంబంధిత కేసుల దస్తావేజులను పరిశీలిస్తూ, వాదనలను వింటూ సిద్ధమయ్యారు.
ఆమె మనవరాలు మాట్లాడుతూ – “మా అమ్మమ్మది చాలా మొండి స్వభావం. మేమంతా వయసు పెద్దదని ఆపినా, ఆమె ఎవరి మాట వినలేదు. తన కుమారుడిని రక్షించడమే తన జీవిత లక్ష్యం అని భావించింది” అని తెలిపింది.
ప్రజల స్పందన
ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. చాలామంది ఆమె తల్లీ ప్రేమకు అభినందనలు తెలియజేస్తూ, వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు బలంగా ఉంటే ఏ వయసులోనైనా కొత్త విద్యలను నేర్చుకోవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఈ సంఘటనలో ఉన్న భావోద్వేగం, తల్లీ బిడ్డల బంధం కోర్టు గోడల మధ్య కూడా కరిగిపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.