చంద‌మామ ఎలా వ‌చ్చిందో గుట్టువిప్పిన శాస్త్రవేత్త‌లు..

చంద‌మామ ఎలా వ‌చ్చిందో గుట్టువిప్పిన శాస్త్రవేత్త‌లు..

మాన‌వుడు అంత‌రిక్షం గురించి తెలుసుకున్నంత కూడా మ‌న సముద్రాల గురించి, భూ అంత‌ర్భాగం గురించి తెలుసుకోలేద‌న్న‌ది నిజం. పెరిగిన సాంకేతిక‌తో ఇప్పుడిప్పుడే ఆ దిశ‌గా ప‌రిశోధ‌న‌లు ఊపందుకుంటున్నాయి. తాజాగా భూ అంత‌ర్భాగంలో (Mantle) ఉండే పొర‌ల్లో ఒక‌టైన మాంటిల్‌లో, ఉప‌రిత‌లానికి సుమారు 2,900 కి.మీ. దిగువ‌న ఒక ఖండం అంత ప‌రిమాణ‌మున్న ముద్ద లాంటి ప‌దార్థాన్ని శాస్త్రవేత్త‌లు క‌నుగొన్నారు.


ఇలాంటి రెండు భారీ ప‌దార్థాలు ప‌సిఫిక్ స‌ముద్రం కింద‌, ఆఫ్రికా ఖండం కింద ఉన్న‌ట్లు తెలుసుకున్నారు. ఇవి ఎందుకు, ఎలా ఏర్ప‌డి ఉంటాయ‌న్న దానిపై శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తుండ‌గా అవి తాజాగా ఒక కొలిక్కి వ‌చ్చాయి. నేచ‌ర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఈ అధ్య‌య‌నం (Study) లో ఒక గ్ర‌హం భూమిని ఢీకొట్ట‌డంతో ఏర్ప‌డిన‌వే ఈ ముద్ద లాంటి ప‌దార్థాలు అని శాస్త్రవేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.


సౌర కుటుంబం ఏర్ప‌డిన తొలిరోజుల్లో ఒక గ్ర‌హం భూమిని ఢీకొట్టింద‌ని.. అప్పుడు అంత‌రిక్షంలోకి లేచిన శిథిలాలే ఇప్ప‌టి చంద‌మామ (Moon Formation) అని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ గ్ర‌హం భూ అంత‌ర్భాగంలోకి చొచ్చుకుపోయింద‌ని వెల్ల‌డించారు. ఆ గ్ర‌హ శిథిలాలే కాల క్ర‌మంలో ఇప్పుడు క‌నిపిస్తున్న విభిన్న గ్ర‌హాల‌ని తెలిపారు.


సుమారు 450 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగింద‌ని చెబుతున్న ఈ ప‌రిణామంలో ఢీకొట్టిన గ్ర‌హాన్ని థియా అని పిలుస్తున్నారు. చంద‌మామ అంత‌ర్భాగంలో కూడా భూ అంత‌ర్భాగంలో ఉన్న మూల‌కాలే ఉండ‌టం.. ఇప్పుడు కనుగొన్న ప‌దార్థానికి.. భూ అంత‌ర్భాగంలో ఉన్న ఇత‌ర మూల‌కాల‌కు సంబంధం లేక‌పోవ‌డం ఈ గ్ర‌హం ఢీకొట్టే ఘ‌ట‌న‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి.


అమెరికా, చైనా, యూకే దేశాల శాస్త్రవేత్త‌లు అంద‌రూ ఈ థియ‌రీని ధ్రువీక‌రిస్తున్నారు. భూమి నివాస‌యోగ్య‌మైన గ్ర‌హంగా ఎలా మార్పు చెందిందో తెలుసుకోవ‌డానికి ఈ ప‌రిశోధ‌న ఉప‌క‌రిస్తుంద‌ని షాంఘై ఆస్ట్రనామిక‌ల్ అబ్జ‌ర్వేట‌రీకి చెందిన శాస్త్రవేత్త హాంగ్‌పింగ్ డెంగ్ పేర్కొన్నారు.