USA | ట్రంప్ ఎఫెక్ట్: నెలలో వెయ్యికి పైగా.. విదేశీ విద్యార్థుల వీసాల రద్ధు!

USA |
విధాత: ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసల నియంత్రణ.. జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్ధులపై తన ప్రతాపం చూపిస్తుంది. గడిచిన నెల వ్యవధిలోనే 1000కిపైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసినట్లుగా సమాచారం. అమెరికాలో 160 కాలేజీలకు సంబంధించి 1024 మంది వీసాలు రద్దు చేసినట్లు తెలుస్తుంది. వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో విద్యార్ధులు దేశాన్ని వీడని పరిస్థితికి కల్పిస్తున్నారు. అరిజోనా స్టేట్ వర్సిటీ, హార్వర్డ్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కాలిఫోర్నియా వర్సిటీ, మసాచుసెట్స్ వర్సిటీలకు చెందిన విద్యార్థుల వీసాల రద్దుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వీసాల రద్ధులో ట్రంప్ యంత్రాంగం తీరుపై ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కోర్టుల్లో దావా వేస్తున్నారు. విదేశీ విద్యార్థుల పట్ల ఫెడరల్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళనలు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి.
దేశానికే నష్టం
విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం అన్యాయని తప్పుబట్టారు. మీ తీరుతో అమెరికా వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని.. ఇది మన దేశానికి కూడా మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ విద్యార్థులే కీలకం
అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందని అమెరికా కంపెనీలలో గుబులు రేగుతోంది.