Harmonium | హర్మోనియం వాయిస్తున్న టీచర్.. బడిబాట పడుతున్న విద్యార్థులు
Harmonium | పిల్లలందరికి చదువుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యల కారణంగా కొందరు బడికి దూరమవుతుంటారు. నిరక్ష్యరాసులుగా మిగిలిపోతుంటారు. బడి( School )కి దూరమవుతున్న పిల్లలను పాఠశాలకు రప్పించేందుకు ఓ టీచర్( Teacher ) వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. పిల్లలందరూ బడిబాట పడుతున్నారు. మరి ఆ టీచర్ చేసిన ప్రయత్నం ఏంటి..? తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Harmonium | బీహార్( Bihar )లోని గయా జిల్లా( Gaya District ) కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో పిప్రాహి( Piprahi )అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 150కి పైగా నివాసాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. కానీ బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. చాలా మంది పిల్లలు గ్రామంలో ఖాళీగా తిరగడం, లేదంటే కూలీ పనులకు వెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. కానీ అలాంటి పిల్లల జీవితాలను చక్కదిద్దేందుకు ఓ సంస్కృత టీచర్ కంకణం కట్టుకున్నారు. పిల్లలను ఎలాగైనా పాఠశాలకు రప్పించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు ఓ సినిమాలోని సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకుని.. పిల్లలను బడిబాట పట్టించారు.
పిప్రాహి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సంస్కృత టీచర్ రామ్‌జీత్ 20025లో బదిలీపై వచ్చారు. తాను వచ్చేసరికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అత్యల్పంగా ఉంది. విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు గ్రామ వీధుల్లో హర్మోనియం వాయిస్తూ.. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. ‘స్కూల్ చలో తుమ్'(పాఠశాలకు వెళ్దాం) అనే సాంగ్‌ను హర్మోనియంతో వాయిస్తూ.. పిల్లల్లో ఒక నూతనోత్తేజాన్ని తీసుకొచ్చారు రామ్‌జీత్. మొత్తానికి రామ్‌జీత్ హర్మోనియం సత్ఫలితాలను ఇచ్చింది.

600కు చేరిన విద్యార్థుల సంఖ్య
పిప్రాహి పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 600కు చేరింది. మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ 300, హైస్కూల్, ప్లస్ టూ స్టూడెండ్స్ 300 మంది ఉంటారు. ఈ 600 మంది విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరవుతున్నారు. టీచర్లు చెప్పిన పాఠాలను విని.. సరికొత్త జీవితానికి పునాదులు వేసుకున్నారు విద్యార్థులు.
ఓ సినిమాలోని సన్నివేశమే ప్రేరణ : రామ్‌జీత్
2025లో బదిలీపై పిప్రాహి స్కూల్‌కు వచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం టీచర్ల కర్తవ్యం. కాబట్టి నేను పిల్లలను బడికి రప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే ఓ సినిమాలోని సన్నివేశం చూసిన తర్వాత హర్మోనియం వాయించే ఆలోచన వచ్చింది. ఓ సీన్‌లో టీచర్ హార్మోనియం వాయించడం, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని స్కూల్‌కు తీసుకురావడం జరిగింది. నాకు ఆ సన్నివేశం బాగా నచ్చింది. ఆ సన్నివేశం నచ్చి మేము మొదట హార్మోనియం వాయిస్తూ ఉర్లోకి వెళ్లినప్పుడు తమ పిల్లలను కూలీ పనులకు లేదా ఇతర పనులకు పంపించే తల్లిదండ్రులు మా గురించి చెడుగా మాట్లాడుకునేవారు. వారు అజ్ఞానం, పేదరికం కారణంగా అలా అంటున్నారని మాకు తెలుసు. అందుకే వారి మాటలకు మేము కోపం తెచ్చుకోలేదు. ప్రతిరోజు పొద్దున్నే తోటి టీచర్లు, విద్యార్థులతో కలిసి గ్రామంలో హర్మోనియం వాయిస్తూ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించాం. మొత్తంగా పిల్లలను బడికి రప్పించడంలో విజయం సాధించాం. ప్రస్తుతం మా పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని రామ్‌జీత్ తెలిపారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం
మరోవైపు, రామ్‌జీత్ చొరవ పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు వారి పిల్లలను స్కూల్‌కు పంపమంటే ఈసడించుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తమ పిల్లలను ప్రతిరోజూ స్కూల్‌కు పంపిస్తున్నారు. అలాగే విద్యార్థులు సైతం పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు. దీంతో పిప్రాహిలోని స్కూల్‌లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram