Auto Charges | హైద‌రాబాద్ : వేస‌వి సెల‌వులు( Summer holidays ) మ‌రో వారం రోజుల్లో ముగియ‌నుండ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠ‌శాల‌ల ప్రారంభోత్స‌వ సంద‌డి నెల‌కొంది. తిరిగి స్కూల్స్‌( Schools )కు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇప్ప‌టికే భారీగా పెరుగుతున్న స్కూళ్ల ఫీజుల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌ల్లిదండ్రుల‌కు.. మ‌రో భారం ప‌డింది. అదేంటంటే ఆటో ఛార్జీల( Auto Charges ) పెంపు.

ప‌శ్చిమాసియా సంక్షోభ‌మే కార‌ణ‌మా..?

విద్యార్థుల‌ను పాఠ‌శాల‌ల‌కు త‌ర‌లించేందుకు చాలా మంది పేరెంట్స్ ఆటోల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. ఇక ఆటోల‌కు నెల‌వారిగా డ‌బ్బుల‌ను చెల్లిస్తుంటారు. అయితే ప‌శ్చిమాసియా సంక్షోభం కార‌ణంగా పెట్రోల్, ఎల్‌పీజీ ఇంధ‌నం కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. దీంతో పెట్రోల్, ఎల్‌పీజీ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. ఈ క్ర‌మంలో ఆటో య‌జ‌మానులు కూడా ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేశారు. ఒక్కో విద్యార్థిపై రూ. 1000కి పైగా వ‌సూలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇది విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు పెనుభారంగా మారింది.

ఆటో ఛార్జీలు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి

ఈ సంద‌ర్భంగా ఓ ఆటో డ్రైవ‌ర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఎల్‌పీజీ ఇంధ‌న ధ‌ర లీట‌ర్‌కు రూ. 58గా ఉండేది. ప‌శ్చిమాసియా సంక్షోభం త‌లెత్తిన త‌ర్వాత ఆ ధ‌ర లీట‌ర్‌కు రూ. 125 పెరిగింది. ప్ర‌స్తుతం ఎల్పీజీ ఇంధ‌నం లీట‌ర్ ధ‌ర రూ. 93గా ఉంది. దీంతో తాము ఆటో ఛార్జీలు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆటో డ్రైవ‌ర్ మ‌హ్మ‌ద్ గౌస్ తెలిపాడు.

బంకుల వ‌ద్ద బారులు తీరాం.. భారీగా న‌ష్టాలు చ‌విచూశాం..

ఎల్‌పీజీ ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా త‌మ‌పై అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని, దీంతో ఛార్జీల‌ను పెంచడం అనివార్య‌మైంద‌ని చాలా మంది ఆటో డ్రైవ‌ర్లు వాపోతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో బంకుల వ‌ద్ద బారులు తీరాల్సి వ‌చ్చింద‌ని, గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో ఉంటే త‌ప్ప ఇంధ‌నం దొర‌క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో లీట‌ర్‌కు రూ. 125 చెల్లించి కొనుగోలు చేశామ‌ని గుర్తు చేశారు. మొత్తానికి భారీగా న‌ష్టాలు చ‌విచూశాం.. ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ద‌ని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ పేర్కొన్నాడు.

ఇద్ద‌రికి క‌లిపి రూ. 8,500 అడుగుతున్నారు..

ఈ నేప‌థ్యంలో ఫ‌ల‌క్‌నూమాకు చెందిన ఓ గృహిణి మాట్లాడుతూ.. మా ఇద్ద‌రు పిల్ల‌లు మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. గ‌తేడాది ఇద్ద‌రికి క‌లిపి నెల‌కు రూ. 6 వేలు చెల్లించాను. ఇప్పుడు ఇద్ద‌రికి క‌లిపి రూ. 8,500 అడుగుతున్నారు. లేదంటే వేరే ఆటో చూసుకోవాల‌ని చెబుతున్నారు. మొత్తానికి త‌మ ఆటో డ్రైవ‌ర్‌ను ఒప్పించి రూ. 7,500కు ఫైన‌ల్ చేశాన‌ని ఆమె తెలిపారు.

డ్రైవ‌ర్లు నిర్ణ‌యించిన ధ‌ర‌ను చెల్లించాల్సిన ప‌రిస్థితి

సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్ర‌యివేటు ఉద్యోగి మాట్లాడుతూ.. త‌మ పిల్లాడిని ఓ ప్ర‌యివేటు కారులో స్కూల్‌కు పంపేవాడిని. గ‌తేడాది నెల‌కు రూ. 3,500 చెల్లించాను. ఇప్పుడు డీజిల్ ధ‌ర‌లు పెరగ‌డంతో.. రూ. 4,500 డిమాండ్ చేస్తున్నారు. డ్రైవ‌ర్లు నిర్ణ‌యించిన ధ‌ర‌ను చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న వాపోయారు.