Donald Trump | నాటో నుంచి వైదొలుగుతాం.. అవి కాగితం పులులన్న ట్రంప్‌

నాటోపై కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్న ట్రంప్‌.. మరోసారి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ అక్కసు వెళ్లగక్కారు. నాటో సభ్యదేశాలను కాగితం పులులుగా అభివర్ణిస్తూ.. దాని నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు.

Donald Trump | నాటో నుంచి వైదొలుగుతాం.. అవి కాగితం పులులన్న ట్రంప్‌

Donald Trump | ఇరాన్‌పై తాను చేస్తున్న సైనిక చర్యకు సహకరించడంలో నాటో విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ నేపథ్యంలో నాటో నుంచి వైదొలిగే అంశాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నానని బుధవారం చెప్పారు. బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటోపై తీవ్ర స్థాయిలో ట్రంప్‌ విరుచుకుపడ్డారు. దానిని ఒక కాగితం పులిగా అభివర్ణించారు. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. ఈ ఘర్షణ తర్వాత నాటోలో అమెరికా సభ్యత్వాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘అవును. తప్పకుండా. ఆ విషయాన్ని నేను నిస్సంకోచంగా చెప్పగలను’ అని బదులిచ్చారు. ‘నాటో ప్రభావానికి నేనెప్పుడూ గురికాలేదు. వాళ్లు కాగితం పులులని నాకు ఎప్పుడూ తెలుసు. పుతిన్‌కు కూడా ఆ విషయం తెలుసు’ అని ట్రంప్‌ అన్నారు.

ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి కెయిర్‌ స్టార్మర్‌.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలోకి యూకే దిగబోదని చెప్పిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇది మా యుద్ధం కాదు. అందులోకి మేం దిగేది లేదు’ అంటూ తన వైఖరిని కెయిర్‌ విస్పష్టంగా ప్రకటించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి సైనిక మద్దతు ఇవ్వాలన్న ట్రంప్‌ విజ్ఞప్తిని నాటో భాగస్వామ్య పక్షాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి యూరోపియన్‌ దేశాలు తోసిపుచ్చాయి. ఆ యుద్ధంతో యూరప్‌కు సంబంధం లేదని చెప్పాయి. దీంతో నాటో భాగస్వామ్య దేశాలు పిరికిపందలంటూ ట్రంప్‌ బహిరంగంగానే మండిపడ్డారు.