మాస్కే కదా అని రూ.13 వేలకు అమ్మేశారు.. దాని విలువ తెలిశాక లబోదిబోమంటున్నారు
విధాత: తాము తక్కువ ధరకు అమ్మేసిన ఒక వస్తువు వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిందని.. తాము మోసపోయామని పేర్కొంటూ ఓ వృద్ధ దంపతులు కోర్టు మెట్లు ఎక్కారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన ఫ్రాన్స్ (France) లో జరిగింది. మెయిల్ ఆన్‌లైన్ అనే వార్తా సంస్థ కథనం ప్రకారం.. 2021లో 80వ పడిలో ఉన్న దంపతులు నైమ్స్ నగరంలో ఉన్న తమ ఇంటిని ఖాళీ చేయాలని భావించారు.
అయితే తరతరాలుగా వస్తున్న కొన్ని వస్తువులు వారి దగ్గర ఉండటంతో వాటిని మ్యూజియంలకు, వేలం సంస్థలకు అమ్మేయాలని భావించారు. అలా ఒక ఆఫ్రికన్ మాస్క్ (Rare African Mask) ను మిస్టర్ జెడ్ అనే ఒక దళారీకి విక్రయించారు. అదీ కేవలం రూ.13 వేల (129 పౌండ్లు)కు. అనంతరం ఎవరి జీవితంలో వారు పడిపోయారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆ దంపతులు వార్తాపత్రికలు తిరగేస్తుండగా ఓ వార్త వారి దృష్టిని ఆకర్షించింది.
కాగా.. తాము అమ్మిన ఆ ఆఫ్రికన్ మాస్క్ ఏకంగా రూజ.36 కోట్ల (3.6 మిలియన్ పౌండ్లు)కు వేలం (Auction) లో అమ్ముడుపోయిందని అందులో ఉంది. మాంట్‌పెలియర్‌లో ఆ వేలంలో జరిగిందని తెలుసుకుని ఆ దళారీతో మాట్లాడినా.. అతడు వీరికి సొమ్ము ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో తమను మభ్యపెట్టి మాయ చేసి ఆ దళారీ తమ వస్తువును తక్కువ ధరకే చేజిక్కించుకున్నాడని దీనిపై తమకు న్యాయం జరగాలని వారు అతడిపై కేసు వేశారు.
ఏంటీ మాస్కు ప్రత్యేకత?
మధ్య ఆఫ్రికా దేశమైన గాబన్ లోని ఫాంగ్ అనే జాతి ఈ మాస్క్‌ను తయారు చేసినట్లు ద మెట్రో న్యూస్ కథనం పేర్కొంది. ఈ తరహా మాస్కులను ఆ జాతి ప్రజలు వివాహాలలోనూ, అంత్యక్రియలలోనూ వాడతారని తెలిపింది. ఈ తరహా మాస్కులు గాబన్ బయట కనిపించడం అరుదేనని.. అక్కడక్కడా పెద్ద పెద్ద మ్యూజియంలలో ఉంటే ఉండొచ్చని తన కథనంలో పేర్కొంది.
ఈ మాస్కును కోర్టు నిపుణుల సాయంతో పరీక్షించగా 19వ శతాబ్దానికి చెందినదని తేలింది. దీంతో గాబన్ మాస్కు అరుదైనది విలువైనదేనని కోర్టు భావించి ఈ కేసును విచారణకు స్వీకరించింది. పిటిషనర్లలో ఒకరి తాత ఆఫ్రికాలో వలసవాదుల కాలంలో గవర్నర్‌గా ఉండేవారని.. ఆయన నుంచి వారికి ఇది వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ సాగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram