France | ఫ్రాన్స్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. అతిపెద్ద పార్టీగా వామపక్షం

ఫ్రాన్స్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన మితవాద పార్టీ.. తుది ఫలితాలు వెలువడే సరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నది

France | ఫ్రాన్స్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. అతిపెద్ద పార్టీగా వామపక్షం

పారిస్‌: ఫ్రాన్స్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన మితవాద పార్టీ.. తుది ఫలితాలు వెలువడే సరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. 577 సీట్లు ఉన్న నేషనల్‌ అసెంబ్లీలో 289 సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ.. ప్రధాన పక్షాలైన మూడు పార్టీలూ మెజార్టీ సాధించలేక పోయాయి. దీంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానున్నది. ఇందులో అధిక సీట్లు గెలుచుకున్న వామపక్షం కీలక పాత్ర పోషించనున్నది. ఐరోపా యూనియన్‌లో ఫ్రాన్స్‌ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే.. రాజకీయ అస్థిరత దేశ ఆర్థిక వ్యవస్థను, షేర్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వామపక్ష సంకీర్ణం న్యూ పాపులర్‌ ఫ్రంట్‌కు 180 సీట్లు, దేశాధ్యక్షుడు మేక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్‌ అలయెన్స్‌కు 160 సీట్లు, మితవాద నేషనల్‌ ర్యాలీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 140 సీట్లు లభించాయి. 2022 ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ 89 సీట్లు గెలుచుకోగా.. ఈసారి తన బలాన్ని పెంచుకున్నది. ఒక దశలో నేషనల్‌ ర్యాలీ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనాలు వెలువడినా.. ప్రజలు మిశ్రమంగా స్పందించారు. హంగ్‌ పార్లమెంటు అనేది ఆధునిక ఫ్రాన్స్‌ చరిత్రలోనే లేదు. ‘గతంలో ఎన్నడూ లేనంతటి రాజకీయ పరిస్థితిని మన దేశం ఎదుర్కొంటున్నది. కొద్దివారాల్లో ప్రపంచాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నది’ అని రాజీనామాకు ముందు ప్రధాని గాబ్రియల్‌ అట్టల్‌ అన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం ఉన్నంత కాలం తన పదవిలో కొనసాగేందుకు సిద్ధమేనని అట్టల్‌ చెప్పారు. అధ్యక్షుడు మేక్రాన్‌కు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్నది. మధ్యంతర ఎన్నికలకు మేక్రాన్‌ తీసుకున్న నిర్ణయంతో అట్టల్‌ స్పష్టంగా విభేదించారు. ప్రస్తుత నేషనల్‌ అసెంబ్లీని రద్దు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అధికారంలో ఉన్న సెంట్రిస్ట్‌ అలయెన్స్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్నదని, స్పష్టమైన మెజార్టీ లేకపోయినా ఇతర పార్టీల నుంచి ఎంపీలను తీసుకుని, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను అడ్డుకోవడమే కాకుండా రెండేళ్లపాటు పరిపాలన కొనసాగించేందుకు అవకాశం ఉన్నదని అన్నారు.

ప్రధాని ఎవరు?

దేశాధ్యక్షుడు మేక్రాన్‌ నాటో సమావేశాల కోసం అమెరికా వెళుతున్న నేపథ్యంలో కొత్త ప్రధాని ఎవరన్న అంశంలో కొన్ని రోజులు సస్పెన్స్‌ కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. పారిస్‌లోని స్టాలిన్‌గ్రాడ్‌ చౌకు వద్ద గుమిగూడిన వామపక్షవాదులు లెఫ్ట్‌ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయన్న ప్రకటన భారీ స్ర్కీన్‌పై ప్రత్యక్షం కాగానే పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. కొంతమంది ఆనందబాష్పాలు రాల్చుతూ ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్నారు. కొన్ని నిమిషాలపాటు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం మారుమోగింది. మెట్రోల్లో ప్రయాణిస్తున్నవారు తుది ఫలితాల ప్రకటన కోసం మొబైల్‌ ఫోన్‌లను పట్టుకుని ఆసక్తిగా ఎదురుచూశారు. ఫలితాలు వెలువడగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ఫ్రాన్స్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

వామపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి.. కొత్త వామపక్ష కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. మేక్రాన్‌ తీసుకొచ్చిన అనేక సంస్కరణలను రద్దు చేస్తామని కొత్త వామపక్ష కూటమి ప్రజలకు హామీ ఇచ్చింది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి తీసుకుంటామని కూడా పేర్కొన్నది. ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తొలి అవకాశం ఇవ్వాలని న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ నేతలు దేశాధ్యక్షుడిని డిమాండ్‌ చేశారు. దేశాన్ని పాలించేందుకు సిద్ధంగా ఉన్నామని వామపక్ష సంకీర్ణం నేతలు జియాన్‌, లూస్‌ మెలెన్‌చాన్‌ చెప్పారు. మితవాద పార్టీని అధికారం నుంచి దూరంగా ఉంచడమే అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అనేక మంది ఓటర్లు భావించారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే దాని ప్రత్యర్థులను గెలిపించారని అంటున్నారు.