Google’s NYC Office Bedbug Infestation : నల్లుల బెడద.. గూగుల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
న్యూయార్క్ గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడదతో ఉద్యోగులకు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది.

విధాత : ప్రపంచ ఐటీ రంగంలో గూగుల్ ప్రధాన కంపెనీగా ఉంది. అలాంటి టెక్ దిగ్గజం కంపెనీకి కూడా నల్లుల పోరు తప్పలేదు. న్యూయార్క్‌లోని గూగుల్ చెల్సియా క్యాంపస్‌లో నల్లుల (Bed Bugs) బెడద తీవ్రం కావడంతో, ఉద్యోగులందరికీ తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) చేయాలని సూచించింది. ఈ సమస్య గురించి అక్టోబరు 19-20, తేదీల్లో తమ ఉద్యోగులకు గూగుల్ అంతర్గత ఈమెయిల్ పంపించింది. కార్యాలయంలో నల్లులు ఉన్నట్లు ఆధారాలను గుర్తించారని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
నల్లుల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు, కీటక నియంత్రణ చర్యల కోసం ఆదివారం నాడు ఆఫీసును మూసివేశారు. నల్లుల వ్యాప్తిని అరికట్టడానికి గూగుల్ హడ్సన్ స్క్వేర్ క్యాంపస్‌తో సహా న్యూయార్క్‌లోని ఇతర కార్యాలయాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. నల్లుల బారిన పడినట్లు లక్షణాలు కనిపిస్తే ఉద్యోగులు పరీక్షలు చేయించుకోవాలని, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది. కాగా, జంతువుల ద్వారా కార్యాలయంలోకి నల్లులు వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, న్యూయార్క్ వాసులకు నల్లుల సమస్య కొత్తేమీ కాదు. 2010లో కూడా గూగుల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరిగింది. టెక్నికల్ బగ్స్ మాత్రమే కాదు.. బెడ్ బగ్స్(నల్లులు) కూడా గూగుల్ పనులు నిలిపివేసే అవకాశాలు ప్రస్తుత సంఘటను చూస్తే అర్తమవుతోంది.