సుందర్‌ పిచాయ్‌కు ఓపెన్‌ఏఐ షాక్‌.. వంద బిలియన్‌ డాలర్ల నష్టం!

తాము కొత్త బ్రౌజర్‌ను తీసుకురాబోతున్నట్టు ఓపెన్‌ఏఐ చేసిన ప్రకటన.. గూగుల్‌ పునాదులను ఒక్కసారిగా వణికించింది. ఓపెన్‌ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌ విషయంలో ట్వీట్ వెలువడిన తర్వాత ఆల్ఫాబెట్‌కు వంద బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వచ్చింది.

సుందర్‌ పిచాయ్‌కు ఓపెన్‌ఏఐ షాక్‌.. వంద బిలియన్‌ డాలర్ల నష్టం!

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా!

గూగుల్‌! ఇంటర్నెట్‌ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా చెలామణీ అవుతున్న దిగ్గజ కంపెనీ! పోకిరి సినిమాలో హీరో చెప్పినట్టుగా.. ‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా? లేదా?’ అనే పద్ధతిలో ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతున్న ఓపెన్‌ఏఐ సుందర్‌ పిచాయ్‌కు భీకరమైన షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ఏఐ రంగంలో దూసుకుపోతున్న ఓపెన్‌ఏఐ.. తాజాగా కొత్త బ్రౌజర్‌ను లాంచ్‌ చేస్తున్నామని ఎక్స్‌లో ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే అల్ఫాబెట్‌ షేర్‌లు దారుణంగా పడిపోయాయి. దీని వల్ల గూగుల్‌ మాతృసంస్థ వంద బిలియన్‌ డాలర్లు (రూ. 87,75,74,80,40,000) నష్టపోయింది. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన గూగుల్‌ క్రోమ్‌ వంటి పాపులర్‌ బ్రౌజర్లకు ఓపెన్‌ఏఐ తీసుకురాబోతున్న బ్రౌజర్‌ పెను సవాలు విసరనున్నది. ఓపెన్‌ఏఐ ఈ ప్రకటన చేసిన రెండు గంటల వ్యవధిలోనే గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్‌ విలువ పడిపోవడం మొదలైంది. నిజానికి అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ అయిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు గూగుల్ షేర్‌ 252.68 డాలర్లుగా ఉన్నది. అది కాస్తా 15 నిమిషాల్లోనే ఏకంగా 246.15 డాలర్లకు పడిపోయింది. అంటే.. సుమారు 100 బిలియన్‌ డాలర్లతో సమానం. తదుపరి కొంత కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 250.46 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇంత మార్కెట్‌ ఒడిదుడుకుల మధ్య కూడా సోమవారంతో పోల్చితే 2.37 శాతం దిగువన ఉండటం గమనార్హం.

ప్రపంచ ప్రఖ్యాత ఏఐ చాట్‌బాట్‌ అయిన చాట్‌జీపీటీ ఓనర్‌ అయిన ఓపెన్‌ఏఐ.. చాట్‌జీపీటీ అట్లాస్‌ పేరిట కొత్త బ్రౌజర్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీనిని పూర్తిస్థాయిలో ఏఐ ఇంటిగ్రేటెడ్‌గా రూపొందించారు. బ్రౌజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తి స్థాయిలో ఇది మార్చివేయనున్నది. ప్రస్తుతం ఈ బ్రౌజర్‌ మాక్‌ఓఎస్‌, విండోస్‌కు అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌లను కూడా ప్రారంభించనున్నారు. కొత్త బ్రౌజర్‌ గురించి ఓపెన్‌ఏఐ యజమాని సామ్‌ ఆల్ట్‌మన్‌ మాట్లాడుతూ.. అట్లాస్‌ ద్వారా యూజర్లు తమ అన్ని రకాల రోజువారీ బ్రౌజింగ్‌ కార్యక్రమాల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు అంచనా.