H-1B $100,000 fees | అమెరికానే ఎక్కువగా నష్టపోతుంది: నిపుణులు, బిగ్ టెక్ కంపెనీల మాట
H-1B వీసాపై $100,000 ఫీజు నిర్ణయం అమెరికా ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, ఉద్యోగాలకే పెద్ద ముప్పు అవుతుందని నాస్‌కామ్, అమితాభ్ కాంత్, మోహనదాస్ పై, GTRIతో పాటు Amazon, Microsoft, Google, Meta వంటి Big Tech కంపెనీలు కూడా హెచ్చరించాయి.

H-1B $100,000 fees | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసాపై ఏడాదికీ 1,00,000 డాలర్ల ఫీజు నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 2,000 నుండి 5,000 డాలర్ల మధ్య ఉన్న వీసా రుసుము ఒక్కసారిగా ఇంత భారీగా పెరగడం వల్ల భారత టెకీలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తుతున్నా, దీర్ఘకాలంలో అమెరికానే ఎక్కువగా నష్టపోతుందని నిపుణులు, టెక్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. నాస్‌కామ్, అమితాబ్ కాంత్, మోహనదాస్ పాయ్, GTRI వంటి వారితో పాటు నిపుణులతో పాటు అమెరికాలోని Amazon, Microsoft, Google, Meta వంటి Big Tech కంపెనీలు కూడా ఈ ఫీజు పెంపును “ఇన్నోవేషన్, ఉద్యోగాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై నేరుగా తీవ్ర ప్రభావం”గా అభివర్ణించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసాపై ఏడాదికీ 1,00,000 డాలర్ల రుసుము ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ నిర్ణయం వల్ల అమెరికాకే తీవ్ర నష్టం జరగనుందని భారత నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నాస్‌కామ్ (NASSCOM) ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్ మాట్లాడుతూ, “వెంటనే అమలు చేయమని చెప్పడం చాలా అన్యాయం. ఇది వ్యాపారాలు కొనసాగించడానికి కష్టమయ్యే పరిస్థితి. కంపెనీల్లో, ప్రొఫెషనల్స్, విద్యార్థులలో గందరగోళం సృష్టిస్తోంది. ఇది చివరికి అమెరికా ఆర్థికరంగానికే ఎక్కువ నష్టం కలిగిస్తుంది.” అన్నారు.
నితి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ అభిప్రాయం ప్రకారం, 1,00,000 డాలర్ల ఫీజు పెంపు వలన అమెరికా సృజనాత్మకత కుంటుపడుతుంది. కొత్త పేటెంట్లు, ల్యాబ్స్, స్టార్టప్‌లు.. భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్‌లకు తరలిపోతాయి. ఈ విధంగా అమెరికా తలుపులు మూస్తే, భారత్ సహా మిగతా దేశాలు లాభపడతాయి” అన్నారు.
ఇన్ఫోసిస్ మాజీ CFO మోహనదాస్ పాయ్ మాట్లాడుతూ, “అమెరికాలో H-1B వీసా హోల్డర్ల సగటు జీతం 1,00,000 డాలర్ల కంటే ఎక్కువ. వీరిని చవక మానవ వనరులుగా చూపించడం తప్పు.ఈ కొత్త ఫీజుతో దరఖాస్తుల సంఖ్య పడిపోతాయి. కంపెనీలు తమ ప్రాజెక్టులను ఇండియాలోనే చేయించుకుంటాయి. ట్రంప్ ఊహిస్తున్నట్లు అమెరికన్లకు ఉద్యోగాలు పెరగడం అంటూ ఉండదు. దీని వల్ల అమెరికాకే నష్టం జరుగుతుంది” అన్నారు.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) విశ్లేషణ ప్రకారం: “భారత కంపెనీలు ఇప్పటికే అమెరికాలో 50 నుండి 80 శాతం వరకు స్థానిక అమెరికన్లను నియమించుకుంటున్నాయి. కాబట్టి భారతీయులు రాకపోయినా అమెరికాలో ఉద్యోగాలు పెరగవు. ఈ లక్ష డాలర్ల ఫీజుతో ఆఫ్‌షోరింగ్ పెరుగుతుంది, వినియోగదారుల ఖర్చులు పెరుగుతాయి, సృజనాత్మకత మందగిస్తుంది. చివరికి అమెరికానే నష్టపోతుంది”.
ఇదిలా ఉండగా, ట్రంప్ ఆదేశాల ఫలితాలను అనుభవించబోయే బిగ్ టెక్ కంపెనీలు, నేరుగా స్పందించకపోయినా, వారి లీగల్ టీమ్‌లు తమ ప్రతిస్పందనను తెలిపాయి.
అమెరికా Big Tech కంపెనీలు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
- Amazon: “మా H-1B ఉద్యోగులు, dependents అమెరికా బయట ఉన్నవారు వెంటనే తిరిగి రావాలి. కొత్త ఫీజు వల్ల ట్రావెల్ రిస్క్ చాలా ఎక్కువ” – Internal Memo.
- Microsoft: “H-1B వీసాలు మాకు కీలకం. లక్ష డాలర్ల ఫీజు వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మేధస్సు తగ్గే ప్రమాదం ఉంది” – Company Advisory.
- Google: “నైపుణ్యం లేకుండా సాంకేతికత ఎప్పుడూ అభివృద్ధి కాదు. ఇలాంటి ఫీజులు కంపెనీలను ఔట్సోర్సింగ్ వైపు మళ్లిస్తాయి” – Legal Counsel.
- Meta: “హెచ్1బిలు సాంకేతిక ఆర్థికరంగానికి వెన్నెముక. ఇంత భారీ ఫీజు చిన్న స్టార్టప్ కంపెనీలను చంపేస్తుంది, పెద్ద కంపెనీలను కూడా ఇబ్బంది పెడుతుంది” – HR Note.
- JP Morgan: “Visa holders దేశం విడిచి వెళ్లకూడదు. పూర్తి స్పష్టత వచ్చేవరకు దేశంలో ఉన్నవారు సురక్షితంగా ఉండాలి. అన్ని రకాల ప్రయాణాలూ మానుకోండి” – Employee Circular.
మొత్తానికి భారత నిపుణులైనా, అమెరికా టెక్ దిగ్గజాలైనా ఏకగ్రీవంగా చెప్పింది ఒకటే —
ఈ లక్ష డాలర్ల H-1B ఫీజు అమెరికా టాలెంట్, ఇన్నోవేషన్, ఎకానమీకి పెద్ద ముప్పు. తాత్కాలికంగా విదేశీ టెకీలకు ఇబ్బందులు ఉన్నా, దీర్ఘకాలంలో అమెరికానే వెనుకబడే ప్రమాదం ఉందని అందరూ హెచ్చరిస్తున్నారు.