Dil Raju | దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు… నిర్మాతలకు ఇండస్ట్రీలో విలువ లేకుండా పోయింది..

Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతలకు ఇండస్ట్రీలో గౌరవం, ప్రాధాన్యత‌ తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • By: sn |    movies |    Published on : Feb 19, 2026 9:50 AM IST
Dil Raju |  దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు… నిర్మాతలకు ఇండస్ట్రీలో విలువ లేకుండా పోయింది..

Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతలకు ఇండస్ట్రీలో గౌరవం, ప్రాధాన్యత‌ తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని మడికేరిలో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్ర‌రావు Atluri Purnachandra Rao 90వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

“నిర్మాత అంటే ఇచ్చేవాడు… ఇప్పుడు పరిస్థితి మారింది”

దిల్ రాజు మాట్లాడుతూ, ఒకప్పుడు నిర్మాత అంటే ఇచ్చేవాడు, సృష్టికర్త, బాధ్యత వహించే వ్యక్తి అని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. “ఎవరైతే నిర్మాత దగ్గర తీసుకుంటున్నారో, వారే ఇప్పుడు నిర్మాతను శాసించే స్థాయికి చేరుకున్నారు. నిర్మాతకు ఉండాల్సిన గౌరవం తగ్గిపోయింది” అని స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులపై ఆయన అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అట్లూరి పూర్ణచంద్రరావుకు నివాళి

87 సినిమాలను నిర్మించిన అట్లూరి పూర్ణచంద్రరావు ఎంతోమందికి స్ఫూర్తి అని దిల్ రాజు కొనియాడారు. విలువలు, నిబద్ధతతో సినిమా నిర్మాణం ఎలా ఉండాలో ఆయన చూపించారని అన్నారు. అలాంటి నిర్మాతల వల్లే పరిశ్రమకు గౌరవం వచ్చిందని గుర్తుచేశారు.

తన మొదటి చిత్రం “దిల్” హిందీ రీమేక్ రైట్స్ విషయంలో అట్లూరి పూర్ణచంద్రరావు తనను సంప్రదించిన సందర్భాన్ని కూడా ఈ వేదికపై ఆయన గుర్తు చేసుకున్నారు. “ఆయన చేస్తానంటే ఫ్రీగా రైట్స్ ఇస్తాను అన్నాను” అని వెల్లడించారు. అలాగే రామానాయుడు D. Ramanaidu వంటి దిగ్గజ నిర్మాతల స్పూర్తితోనే తాను సినిమాలు చేస్తున్నానని తెలిపారు.

విలువలతో కూడిన సినిమా నిర్మాణం

ఈ సందర్భంగా దిల్ రాజు మరో కీలక ప్రకటన చేశారు. అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో త్వరలోనే విలువలతో కూడిన సినిమాను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మంచి కథలు, మంచి విలువలతో సినిమాలు తీసే అవసరం ఉందని ఆయన అన్నారు.

దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిర్మాతల ప్రాధాన్యం, ఇండస్ట్రీలో మారుతున్న సమీకరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.