Iran War | ఇరాన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియని స్థితిలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోతున్నారన్న చర్చలు ఊపందుకుంటున్నాయి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా ఖమేనీని హతమార్చిన అమెరికా.. ఇక యుద్ధం రెండు మూడు రోజుల్లో ముగిసిపోతుందని నమ్మకం పెట్టుకుంది. కానీ.. ఆ నమ్మకాన్ని ఇరాన్ వమ్ము చేసింది. యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడం ద్వారా అమెరికాపై ఇతర దేశాల ఒత్తిడి పెరిగేలా చూడటం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తున్నది. 22వ రోజుకు చేరుకున్న యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలను అమెరికా ఎత్తేయడం సంచలనం రేపింది. యుద్ధంతో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగానే ట్రంప్ ఈ చర్య తీసుకున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నాటో దేశాలు ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతుగా నిలువకపోవడం గమనార్హం. దీనిపై తీవ్ర స్థాయిలోనే అక్కసు వెళ్లగక్కిన ట్రంప్.. తమకు సహకరించని నాటో దేశాలను ‘పిరికిపందలు’గా అభివర్ణించారు.
అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన మార్కెట్లు కుదేలవుతున్న సమయంలో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు సంబంధించిన కొంత చమురు అమ్మకాలపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు నిల్వల అమ్మకాలకు పరిమిత కాలానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఈ అనుమతి ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉంటుంది. అమెరికా ఇప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న విధానానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. అయితే దీని ఫలితం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాలి.
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైన తర్వతా నుంచీ చమురు, గ్యాస్ ధరలు చుక్కలనంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్ సుమారు 112 డాలర్ల వద్ద ఉంది. ఇది గతేడాదితో పోల్చితే 53% అధికం. ఈ నిర్ణయం మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పైపెచ్చు.. ఈ అమ్మకాల ద్వారా వచ్చే నిధులు తిరిగి ఇరాన్ ప్రభుత్వానికి చేరే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ అనుమతితో సుమారు 140 మిలియన్ బ్యారెల్స్ చమురు అంతర్జాతీయ మార్కెట్‌లోకి రావచ్చని స్కాట్ బెసెంట్ అంచనా వేశారు.
ఇరాన్ అణు స్థావరంపై దాడి..
ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రం నాటాన్జ్‌పై అమెరికా బలగాలు దాడులు చేశాయి. అయితే.. ఈ దాడిలో ఎలాంటి రేడియోయాక్టివ్ లీక్ కాలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపాయి. మరోవైపు శుక్రవారం ఉదయం ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లను హిందూ మహాసముద్రంలోని అమెరికా–బ్రిటన్ సంయుక్త మిలిటరీ బేస్ డీగో గార్షియాపైకి ప్రయోగించింది. రెండు మిస్సైళ్లను ప్రయోగించినప్పటికీ.. అవి మిలిటరీ బేస్‌ను తాకలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ తీరం నుంచి 3,810 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా.. అమెరికాకు అత్యంత కీలకమైన మిలిటరీ కేంద్రం. అమెరికా బాంబర్ యుద్ధ విమానాలు, కేసీ 135 వంటి ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, గూఢచార విమానాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే.. అమెరికా చర్యపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భిన్నంగా స్పందించింది. ఈ దాడిలో తమ పాత్ర లేదని తెలిపింది.
ట్రంప్‌కు గుణపాఠం చెబుతాం
మిలిటరీ ఆపరేషన్లను ముగించే దిశగా ఉన్నామన్న ట్రంప్ వ్యాఖ్యలపై పేరు రాయడానికి నిరాకరించిన ఇరాన్ అధికారి ఒకరు ISNA న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ట్రంప్ ప్రకటనలను టెహరాన్ విశ్వసించబోదు. ఈ ప్రాంతంలో అమెరికా మిలిటరీ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులూ లేవు. ట్రంప్ చెబుతున్న మాటలు.. క్షేత్రస్థాయి వాస్తవాలతో సరిపోలడం లేదు. ఇక ఇప్పుడు మేం ట్రంప్‌కు ఒక చిన్న పాఠం చెబుతాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
