Ukraine Russia War | కీవ్‌ నగరంపై రష్యా అతిపెద్ద దాడి.. 550 డ్రోన్లు, 11 క్షిపణులు ప్రయోగం

Ukraine Russia War | కీవ్‌ నగరంపై రష్యా అతిపెద్ద దాడి.. 550 డ్రోన్లు, 11 క్షిపణులు ప్రయోగం

Ukraine Russia War | డ్రోన్లు, క్షిపణులతో జూలై నాలుగో తేదీ రాత్రంతా రష్యా జరిపిన దాడులతో కీవ్‌ నగరం అల్లకల్లోలమైంది. ఈ దాడుల్లో 23 మంది గాయపడినట్టు తెలుస్తున్నది. నగర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. అనేక భవంతులు, వాహనాలు తగలబడిపోయాయని శుక్రవారం (జూలై 4 2025) ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా మొత్తం 539 డ్రోన్లు, 11 మిస్సైళ్లను ప్రయోగించడంతో కీవ్‌ నగరంలో దాదాపు ఎనిమిది గంటలపాటు వైమానిక దాడులపై అప్రమత్తం చేసే సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో కీవ్‌ నగరంపై దాడుల తీవ్రతను పెంచిన క్రమంలో తాజా దాడులు చోటు చేసుకున్నాయి. దాదాపు 30 లక్షల మంది ప్రజలు కీవ్‌ నగరంలో నివసిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. రష్యా దాడుల్లో దేశంలోనే రైల్వే నెట్‌వర్క్‌ దెబ్బతినడంతో పెద్ద సంఖ్యలో ప్యాసింజర్‌ రైళ్లను దారిమళ్లించినట్టు, రైలు ప్రయాణాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నట్టు ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద రైల్వే ఉక్రజాలిజ్నిట్సియా తెలిపింది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరం ప్రధాన టార్గెట్‌గా ఈ దాడులు చోటుచేసుకున్నట్టు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. గాయపడినవారిలో 14 మందికి హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నట్టు కీవ్‌ మేయర్‌ విటాలి విటాలి క్లిట్ష్కో తెలిపారు. కీవ్‌లోని పది జిల్లాలకు గాను దినిప్రో నదికి అటూ ఇటూ ఉన్న ఆరు జిల్లాల్లో విధ్వంసం రికార్డైందని పేర్కొన్నారు. డ్రోన్‌ శిథిలాలు పడటంతో హోలోసివిస్కీ లో ఒక హాస్పిటల్‌ మంటల్లో చిక్కుకున్నదని తెలిపారు. శిథిలాలు, మంటల కారణంగా వాతావరణం ప్రమాదకరంగా మారినందున నగర పౌరులు తమ ఇళ్ల కిటికీలు మూసి ఉంచాలని కీవ్‌ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేటర్‌ తైమూర్‌ టకాచెంకో విజ్ఞప్తి చేశారు. రష్యాను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఆయన.. ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. రష్యన్లు చేసిన పని ఉగ్రవాదం, హత్యకు ఏ మాత్రం తీసిపోదని వ్యాఖ్యానించారు.

దాడులు జరుగుతున్న సమయంలో ప్రజలు రక్షణ స్థావరాలకు పరుగులు తీస్తున్న వీడియోలు, అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. రష్యా ప్రయోగించిన 478 గగన తల ఆయుధాలను గాలిలోనే నాశనం చేశామని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. మొత్తం ఎనిమిది లోకేషన్లలో 9 మిస్సైళ్లు, 63 డ్రోన్‌ దాడులు జరిగినట్టు పేర్కొన్నది. గురువారం రాత్రి ఉక్రెయిన్‌ తూర్పు నగరమైన పోక్రోవ్స్క్ సమీపంలో రష్యా జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. కొన్ని నెలలుగా ఈ ప్రాంతాన్ని రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. పౌరులు లక్ష్యంగా దాడులు జరుగటం లేదని ఇరు దేశాలు చెబుతున్నప్పటికీ.. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్టు అనధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అందులోనూ ఉక్రెయిన్‌ వాసులే చనిపోయినవారిలో ఎక్కువ ఉన్నారు.