Python | మెడిసిన్స్‌కు వెళ్లిన మహిళ అదృశ్యం.. కొండచిలువ శరీరంలో శవమై తేలింది..
Python | ఓ మహిళ ట్యాబ్లెట్ల కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ దారి మధ్యలోనే ఆమెను ఓ భారీ కొండచిలువ మింగేసింది. ఈ ఘటన సెంట్రల్ ఇండోనేషియాలో వెలుగు చూసింది.

Python | ఓ మహిళ ట్యాబ్లెట్ల కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ దారి మధ్యలోనే ఆమెను ఓ భారీ కొండచిలువ మింగేసింది. ఈ ఘటన సెంట్రల్ ఇండోనేషియాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఇండోనేషియాలోని సితేబా గ్రామానికి చెందిన సిరాయిటి(36) తన భర్త, కుమారుడితో కలిసి ఉంటుంది. అయితే కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో.. ఆ పిల్లాడికి మెడిసిన్స్ తీసుకొద్దామని జులై 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ట్యాబ్లెట్స్ కోసం వెళ్లిన ఆవిడ ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన భర్త ఆడియాన్సా తన భార్య ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాడు.
జులై 4వ తేదీన తన ఇంటికి 500 మీటర్ల దూరంలో భార్య చెప్పులు, ప్యాంట్‌ను కనుగొన్నాడు భర్త. చెప్పులు లభ్యమైన స్థలానికి మరో 10 మీటర్ల దూరంలో 16 అడుగుల కొండచిలువ కనిపించింది. ఆ పైథాన్ కడుపు కూడా ఉబ్బి ఉంది. దీంతో సిరాయిటిని కొండచిలువే మింగి ఉంటుందని గ్రామస్తులు అనుమానించారు. మొత్తానికి కొండచిలువను బంధించి, దాని కడుపు కోయగా మహిళ శవమై కనిపించింది. దీంతో భర్త, కుమారుడు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఇండోనేషియాలోని సౌత్ సులావేసి ప్రావిన్స్‌లోనూ ఓ భారీ కొండచిలువ 45 ఏండ్ల మహిళను మింగేసింది. ఇండోనేషియా, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో కొండచిలువలు అధికంగా ఉంటాయి. వాటి పదునైన దంతాలతో ఇతర జీవులను ఇట్టే పట్టేస్తాయి. ఆ తర్వాత మొత్తాన్ని మింగేస్తాయి. కొండచిలువలు సాధారణంగా కోతులు, పందులు, ఇతర క్షీరదాలను వేటాడుతాయి. మనషులను తక్కువ కానీ, కనిపిస్తే మాత్రం వదలవు.