డాటా సెంటర్లపై తిరగబడుతున్న అమెరికన్లు.. జూలై 18న 50 నగరాల్లో ఆందోళనలు

డాటా సెంటర్ల వల్ల చోటు చేసుకొనే విధ్వంసాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రజలు వాటి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని 50 ప్రధాన నగరాల్లో జూలై 18న పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు. కానీ.. భారతదేశంలో మాత్రం వివిధ ప్రభుత్వాలు అంతటి విధ్వంసకర డాటా సెంటర్లను ఎదురేగి మరీ స్వాగతిస్తున్నారు.

humans-first-data-centers

ప్రపంచ పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా దేశంలో డాటా సెంటర్ల ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డాటా సెంటర్ల స్థాపనను వ్యతిరేకిస్తూ జూలై 18 దేశవ్యాప్తంగా 50 నగరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని ‘హ్యూమన్స్ ఫస్ట్’ అనే సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలు ముందుకు వచ్చి గొంతెత్తాలని పిలుపునిచ్చింది. అమెరికాలోని ‘హ్యూమన్స్ ఫస్ట్’ అనే సంస్థ స్థానిక ప్రభుత్వాలు, ఫెడరల్ అధికారులపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నీటి అవసరాలు, ఇతర వనరులను కాపాడుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

డాటా సెంటర్ల ఏర్పాటుపై నిపుణుల హెచ్చరికలు

వేగంగా విస్తరిస్తున్న ఏఐ (కృత్రిమ మేథ) కారణంగా భూ వినియోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని, జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అనేక మంది నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన పోల్‌లో దేశవ్యాప్తంగా 4వేల డాటా సెంటర్లు ఉన్నట్లు వెల్లడి కాగా, 70 శాతం స్థానికులు వీటి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. హ్యూమన్ ఫస్ట్ సంస్థ ప్రతినిధి అమీ క్రెమర్ మాట్లాడుతూ, జూలై 18న నిర్వహించే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ఆ రోజు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రజలు ప్రకటిస్తారన్నారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ రంగంలో ముందంజలో ఉండేందుకు అమెరికా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించడం మూలగా మౌలిక వసతులు మరింత అధ్వాన్న స్థితికి చేరుకుంటున్నాయని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. ఏఐ రంగంలో చైనా దేశాన్ని అధిగమించేందుకు త్వరగా డాటా సెంటర్ల ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమకు అన్యాయం చేస్తున్నారనే భావనలో ఉన్నారని, తమ మాట ఆలకించడం లేదనే ఆగ్రహంతో ఆందోళనకు మద్ధతు పలుకుతున్నారన్నారు. టెక్నాలజీ వలన ప్రస్తుతం ఏం నష్టం జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగే నష్టంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏఐ ని అభివృద్ధి చేసే పరుగులో అమెరికా కూడా ఉందని, దీన్ని నియంత్రించడం ఎలా అనేది కూడా కనీసం ఆలోచించడం లేదని అమీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఆపవద్దని చెప్పడం లేదని, తగిన ప్రాంతాల్లో డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తే అమెరికన్లకు ప్రయోజనం జరుగుతుందని చెప్పారు. పెద్ద కంపెనీలను ప్రోత్సహించవద్దని ఆమె సూచించారు. కంపెనీలు స్వయంగా నిబంధనలు రూపొందించుకుని డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని, ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయిందన్నారు. కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాటా సెంటర్ల ను ఎవరు ఏర్పాటు చేస్తున్నారనేది ప్రజలకు తెలియకుండా పూర్తిగా గోప్యత పాటిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చీకటి ఒప్పందాల కారణంగా ప్రకృతి వనరుల విధ్వంసం జరుగుతుందని, ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్ధిత ఏర్పడుతుందన్నారు. నీటి వనరులు కలుషితం అవుతాయని, ధ్వని కాలుష్యం పెరుగుతుందని, విద్యుత్ బిల్లులు అమాంతం పెరుగుతాయన్నారు. అయితే డాటా సెంటర్ల ఏర్పాటు మూలంగా ఏఐ పందెంలో ముందుంటామని, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయల కల్పన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని అమెరికా పాలకులు నమ్మబలుకుతున్నారు.

ప్రతి పది మందిలో ఏడుగురు వ్యతిరేకమే

డాటా సెంటర్ల ఏర్పాటుతో జరిగే పర్యావరణ విధ్వంసంపై పోల్ నిర్వహించగా, ప్రతి పది మంది అమెరికన్లలో ఏడుగురు వీటిని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రాంతంలో డాటా సెంటర్ ఏర్పాటు చేయవద్దంటూ 48 శాతం మంది వ్యతిరేకించడం గమనార్హం. వీటి రాకతో జల వనరులు పడిపోతాయని, విద్యుత్ వినియోగం పెరుగుతుందని, వ్యవసాయ భూములు ధ్వంసం అవుతాయని, వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రజలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మెరుగైన జీవనానికి దూరం అవుతామని, ట్రాఫిక్ రద్ధీ పెరుగుతుందని, ప్రజారోగ్యం దెబ్బతింటుందని, ఆస్తుల విలువపై ప్రభావం చూపిస్తుందని పోల్ లో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. అమెరికా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో దేశ వ్యాప్తంగా 64 బిలియన్ డాలర్ల విలువ చేసే డాటా సెంటర్ల ఏర్పాటుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని డాటా సెంటర్ వాచ్ అనే సంస్థ తన నివేదికను వెల్లడించింది.

Latest News