Nobel Peace Prize | రేపే నోబెల్‌ శాంతి బహుమతి 2025 ప్రకటన: ట్రంప్‌కు దక్కేనా? పోటీలో ఎవరు?

నోబెల్‌ శాంతి బహుమతి 2025 ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ ప్రపంచాన్ని కట్టిపడేస్తోంది. ట్రంప్‌ కల సాకారమవుతుందా? లేక సూడాన్‌ వాలంటీర్లు, యులియా నవాల్నయా వంటి నిజమైన శాంతి కాముకులకా?

Nobel Peace Prize | రేపే నోబెల్‌ శాంతి బహుమతి 2025 ప్రకటన: ట్రంప్‌కు దక్కేనా? పోటీలో ఎవరు?

Nobel Peace Prize 2025: Will Donald Trump win — or will true peace crusaders take the honor?

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (విధాత‌):
Nobel Peace Prize | ప్రపంచమంతా యుద్ధాలతో రగిలిపోతున్న ఈ కాలంలో… శాంతి గౌరవం ఎవరికి దక్కుతుందన్న ప్రశ్న మళ్లీ నోబెల్‌ వేదికపై తలెత్తింది. శుక్రవారం (అక్టోబర్‌ 10) ఓస్లోలోని నార్వేజియన్‌ కమిటీ ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి 2025 గ్రహీత పేరును ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేషన్లలో ఉన్నప్పటికీ, ప్రపంచ దృష్టి కొన్ని కీలక పేర్లపైనే నిలిచింది — వాటిలో ఒకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.

The Norwegian Nobel Institute, where the committee holds its meetings

గాజా యుద్ధం ఆపి శాంతి ఒప్పందం కుదిర్చిన తర్వాత ట్రంప్‌ తనను తాను “పీస్‌ ప్రెసిడెంట్‌” అని పేర్కొన్నారు. సెప్టెంబరు 29న వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో సమావేశమైన ట్రంప్‌, తన 20 పాయింట్ల శాంతి ప్రణాళికను అందజేశారు. ఇజ్రాయెల్‌ పునరుద్ధరణకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నా, ప్రైవేట్‌గా మాత్రం ఒప్పందం చేసుకోక తప్పదని నెతన్యాహూను గట్టిగా హెచ్చరించారు. అరబ్‌, ముస్లిం దేశాలతో చర్చలు జరిపి హమాస్‌ను ఒత్తిడికి గురి చేశారు. అక్టోబర్‌ 5 లోపు ఒప్పందం కుదరాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హమాస్‌కు స్పష్టమైన డెడ్‌లైన్‌ పెట్టారు. చివరికి హమాస్‌ వెనక్కి తగ్గి బందీల విడుదలకు అంగీకరించింది. తన మిత్రదేశాలైన పాకిస్తాన్​, టర్కీలతో సిఫారసు చేయించుకున్నారు.  వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం, ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని మధ్యప్రాచ్యంలో శాంతికి గొప్ప మలుపుగా భావిస్తున్నారు. “నేను ఎనిమిది ఘర్షణలను ఆపాను. నోబెల్‌ బహుమతి నాకు రావాలి,” అని ఆయన ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసారు కానీ, నార్వేజియన్‌ విశ్లేషకులు మాత్రం ఆయనకు అవకాశం తక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.  కారణం, ట్రంప్​ బ్లాక్​మెయిల్​ రాజకీయాలన్నీ నోబెల్​ కమిటీకి కూడా విదితమే. ఈ ఏడాది కమిటీ వివాదాస్పద వ్యక్తులకన్నా, శాంతి కోసం నిశ్శబ్దంగా పోరాడిన వారిని గౌరవించే అవకాశం ఎక్కువ అని నార్వేజియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్​ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ హాల్వర్డ్‌ లైరా పేర్కొన్నారు.

Nobel Peace Prize : రక్తపాతాలతో ఎరుపెక్కిన భూగోళం

గాజా, ఉక్రెయిన్‌, ఇరాన్‌, పాకిస్తాన్‌ సరిహద్దులు, ఆఫ్రికాలో సూడాన్‌ యుద్ధం, ఆసియాలో థాయిలాండ్‌–కాంబోడియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచం ఈ ఏడాది రక్తపాతాలతో తల్లడిల్లింది.. ఈ నేపథ్యంలో, కమిటీ ఎంపిక చేసే వ్యక్తి పేరు కేవలం ఒక బహుమతిగా కాకుండా, ప్రపంచానికి ఒక సందేశంగా నిలవనుంది.

ఇందుకే ఈసారి దృష్టి ట్రంప్‌ వంటి రాజకీయ నేతల నుంచి మానవతా యోధుల వైపుకు మళ్లింది. పోటీదారుల జాబితాలో ఇవే పేర్లు ప్రధానంగా చర్చనీయాంశంగా మారనున్నాయి.

Nobel Peace Prize 2025: true peace crusaders take the honor?

  1. సూడాన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ రూమ్స్‌ (Sudan’s Emergency Response Rooms):
    యుద్ధం, ఆకలితో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందిస్తూ వేలమందిని కాపాడిన స్వచ్ఛంద సేవకుల బృందం. శాంతి, మానవతా విలువలకు ఇది గొప్ప ఉదాహరణగా భావిస్తున్నారు.
  2. యులియా నవాల్నయా (Yulia Navalnaya):
    రష్యా ప్రతిపక్ష నేత దివంగత ఆలెక్సీ నవాల్నీ భార్య. రష్యాలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసం చేస్తున్న పోరాటం కారణంగా ఆమెను పోటీదారుగా భావిస్తున్నారు.
  3. ఆఫీస్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ODIHR):
    ఎన్నికల పర్యవేక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ యూరోపియన్‌ సంస్థకు కూడా నోబెల్‌ అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
  4. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ (António Guterres):
    గాజా, ఉక్రెయిన్‌ వంటి ఘర్షణల్లో మానవతా దృక్పథంతో స్పందించినందుకు ఆయన పేరు కూడా పరిగణనలోకి రావచ్చని నార్వే మీడియా పేర్కొంది.
  5. UNHCR లేదా UNRWA (శరణార్థుల సహాయ సంస్థలు):
    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది శరణార్థులకు, నిరాశ్రయులకు సహాయం అందిస్తున్నందుకు గాను ఈ సంస్థలు నోబెల్‌ జాబితాలో ప్రతిసారీ నిలుస్తుంటాయి. ఈసారి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
  6. ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్ట్‌ (ICC) మరియు ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ICJ):
    గాజా, ఉక్రెయిన్‌ యుద్ధాల్లో యుద్ధ నేరాలపై విచారణ జరిపినందుకు వీటికి కూడా శాంతి బహుమతి దక్కే  అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నోబెల్‌ చరిత్రలో అమెరికా అధ్యక్షులు

ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు:

  • థియోడోర్‌ రూజ్‌వెల్ట్‌ (1906)
  • వుడ్‌రో విల్సన్‌ (1919)
  • జిమ్మీ కార్టర్‌ (2002)
  • బరాక్‌ ఒబామా (2009)

ఒబామా కేవలం తొమ్మిది నెలలకే ఈ బహుమతి అందుకోవడం కూడా ట్రంప్‌ తీవ్ర అసహనానికి కారణమైంది. “ఒబామా ఏం చేశాడో కూడా తెలియదు, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు” అంటూ ట్రంప్‌ పలుమార్లు వ్యాఖ్యానించారు. నోబెల్‌ కమిటీ గత కొన్నేళ్లుగా రాజకీయ శాంతి ఒప్పందాల కంటే, సామాజిక న్యాయం, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడే దిశగా ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ట్రంప్‌ లాంటి నాయకులు ఆశ చూపించినా, కమిటీ దృష్టి ఇప్పుడు నిజమైన మానవతాయోధులపై ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 (భారత కాలమానం) ఓస్లో నుంచి వెలువడే ఆ ఒక్క ప్రకటనతో —

2025లో శాంతికి నిర్వచనం ఏంటన్నది ప్రపంచానికి తెలియబోతుంది.

విధాత ఇంటర్నేషనల్ డెస్క్

తాజా తెలుగు వార్తలు vidhaatha.comలో చదవండి.