110 డాలర్లకు చేరువలో క్రూడాయిల్.. ఎన్నికలు ముగియడంతో మోత మోగుతుందా?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతూ బ్యారెల్‌ 107 డాలర్లకు చేరాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే 110 డాలర్ల మార్క్ దాటే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడిని భరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

విధాత, హైదరాబాద్:

అంతర్జాతీయమార్కెట్ లో క్రూడాయిల్ ధర 110 డాలర్లకు చేరువలో ఉంది. సోమవారం మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 107 డాలర్లకు చేరుకున్నది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే 110 డాలర్లు దాటిపోతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భారత్ లాంటి దేశాలు ఈ ధరల పెరుగుదలతో ఆర్థికంగా అనేక ఆటుపోట్లకు గురికాక తప్పదని ఆర్థిక‌వేత్తలు హెచ్చరిస్తున్నారు. ద్రవ్వోల్బణంతోపాటు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు అమాంతం పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, ప్రభుత్వ ఆయిల్ కంపెనీల లాభాల్లో భారీ క్షీణత, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తారుమారు అవుతుందంటున్నారు. ఆ కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

మూడంకెలకు చేరుకున్న బ్యారెల్‌ ధర

నిన్న మొన్నటి వరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర రెండంకెలకు పరిమితం కాగా సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో మూడు అంకెలు అనగా 107 డాలర్లకు చేరుకున్నది. గతంలో వంద డాలర్లకు చేరువ అవుతున్న సందర్భంలో వ్యాపారులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. భారత దేశంలో వినియోగించే ఇంధన ఉత్పత్తుల్లో 85 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయి. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు దిగుమతులపై ఆర్థికంగా ప్రభావం చూపించనున్నాయి. క్రూడాయిల్ బ్యారెల్‌పై 10 డాలర్లు పెరిగితే భారత్‌లో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురు కావడంతో పాటు డాలర్ రూపంలో చెల్లింపులు పెరుగుతాయి. 90 డాలర్ల నుంచి 110 డాలర్లకు పెరగడం మూలంగా కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం‌తో పాటు ఒత్తిడి రెట్టింపు అవుతుంది. దిగుమతుల బిల్లులు పెరగడం మూలంగా ఆ భారాన్ని ప్రజలపై వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం ప్రభుత్వానికి లేకుండాపోయింది.

పెంపుదలను అడ్డుకున్న అసెంబ్లీ ఎన్నికలు

క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా పాత ధరలనే కొనసాగించడం విశేషం. ధరల పెంపుదలలో తమ ప్రమేయం లేదని బయటకు చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా ఆయిల్ కంపెనీలను నియంత్రించారనే విమర్శలు ఉన్నాయి. దేశంలో ధరల పెరుగుదల క్రూడ్ పైనే కాకుండా శుద్ధి చేయడం, విదేశీ మారకం, ప్రభుత్వ పాలసీలపై ఆధారపడి ఉంది. ఇప్పటికిప్పుడు ఈ ధరల పెరుగుదల ప్రజలపై ప్రభావం చూపనప్పటికీ, దీర్ఘకాలికంగా తీవ్ర ఒత్తిడి, వేదనకు గురి చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

క్రూడాయిల్ ధరల పెరుగుదలతో ఎక్కువ మొత్తంలో డాలర్లతో చెల్లించడం మూలంగా రూపాయి పై ప్రభావం చూపిస్తుంది. విలువ తగ్గడంతో ప్రపంచ పెట్టుబడిదారులు పునరాలోచనలో పడతారు. రూపాయి క్షీణతతో దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ ధర ఖర్చు పెరుగుతుంది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా క్రూడ్, కరెన్సీ లింక్ విడదీయని విధంగా తయారైందని ప్రపంచ ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

వివిధ రంగాలపై పెను ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర పెరుగుదల మూలంగా కొన్ని రంగాలపై స్వల్పంగా, మరికొన్ని రంగాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. విమానాలలో ఉపయోగించే జెట్ ఫ్యూయల్ ధరలు పెరుగుతాయి. పెయింట్ కంపెనీలు, కెమికల్ కంపెనీల లాభాల్లో క్షీణత తప్పదు. టైరు తయారీదారులు, లాజిస్టిక్ కంపెనీలు ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2022 లో క్రూడాయిల్ ధరలు 110 డాలర్లకు చేరుకున్నది. ఆ సంవత్సరం ప్రపంచ మార్కెట్ లో ద్రవ్యోల్భణం ఏర్పడింది. సెంట్రల్ బ్యాంకు ఊహించని విధంగా ఆర్థిక లావాదేవీలపై పన్నులు పెంచడంతో ప్రపంచ మార్కెట్లు కుదుపునకు గురయ్యాయి. అయితే 2022 నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని కాదు కాని క్రూడ్ ధర 110 డాలర్లకు చేరుకుంటుందంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలోనూ సంక్షోభం

క్రూడాయిల్ ధరల పెరుగుదల, లాభాల్లో క్షీణత వంటి కారణాలతో తెలంగాణ, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఆయిల్ కంపెనీలు సరఫరాలో భారీ కోత విధించాయి. దీంతో బంకు యజమానులు నిర్ణీత సమయంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాలలో బంకుల ముందు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒకప్పుడు ఎల్పీజీ ఆటోలు బంకుల ముందు క్యూ కట్టగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనదారులు వరుసలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయిల్ కంపెనీలను నియంత్రించడంలో తెలంగాణ పౌర సరఫరాల విభాగం పూర్తిగా విఫలం అయ్యిందని వాహనదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరఫరాలో కోత విధిస్తుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

Latest News