విద్యార్ధి ఉన్మాదం..ఏడుగురి దుర్మణం

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థి కాల్పులకు తెగబడటంతో ఏడుగురు మృతి చెందారు. 15 మంది గాయపడగా, అనంతరం నిందిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

మానసిక స్థిమితం కోల్పోయిన ఓ విద్యార్థి తన ఉన్మాదంలో నరమేథం సృష్టించి చివరకు తనకు తాను కాల్చుకుని మరణించిన ఘటన థాయ్ లాండ్ లో కలకలం రేపింది. నొంతగురి ప్రావిన్స్‌ బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలోని డెబ్సిరిన్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి.. తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.

స్కూల్‌కు వెళ్లడానికి ముందు ఆ విద్యార్థి ఇంట్లో తన బామ్మ, తాతలను కూడా కాల్చి చంపినట్లు థాయ్‌లాండ్ ప్రజారోగ్య మంత్రి తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్‌గన్ అతడి తాతకు చెందినదిగా గుర్తించామన్నారు. విద్యార్థి తాత కూడా గతంలో ఉపాధ్యాయుడిగా పని చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై థాయ్ ఉప ప్రధాని అనుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని..దాడికి గల కారణాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Latest News