Sheikh Hasina । బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా

బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా సోమవారం రాజీనామా చేశారు. 98 మంది మరణానికి కారణమైన ఆదివారం నాటి హింసాత్మక ఘటనలు, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు

Sheikh Hasina । బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా

ఢాకా : బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా సోమవారం రాజీనామా చేశారు. ఆది, సోమవారాల్లో 106 మంది మరణానికి కారణమైన హింసాత్మక ఘటనలు, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షల మంది తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడానికి ముందే ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమె రాజీనామా చేసిన విషయాన్ని దేశ ఆర్మీ చీఫ్‌ వాకెర్‌ ఉజ్‌ జమాన్‌ ధృవీకరించారు.

సోమవారం ఆయన జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగించారు. పాలనా పగ్గాలను తాత్కాలిక ప్రభుత్వం చేపట్టబోతున్నదని ఆయన తెలిపారు. తాను రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడానని, శాంతి భద్రతల బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని చెప్పానని తెలిపారు. దేశ పూర్తి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆర్మీ పట్ల విశ్వాసం ఉంచాలని, ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆందోళనకారులపై కాల్పులు జరుపవద్దని ఆర్మీ, పోలీసులను ఆదేశించినట్టు జమాన్‌ తెలిపారు. అంతా సంయమనం పాటించాలని, ఆందోళనలను విరమించాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే శాంతిని నెలకొల్పుతామని జమాన్‌ హామీ ఇచ్చారు. దేశాధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ను కలువబోతున్నానని చెప్పారు.

త్రిపురకు పారిపోయిన హసీనా?

ఢాకాలోని తన అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయిన హసీనా.. త్రిపురకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే 106 మంది చనిపోయిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. త్రిపురలోని అగర్తలకు ఆమె హెలికాప్టర్‌లో వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. త్రిపుర హోం శాఖ కార్యదర్శి మాత్రం తమకు అలాంటి సమాచారమేదీ లేదని తెలిపారు.

అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌

బంగ్లాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు, ప్రధాని రాజీనామా నేపథ్యంలో భారత సరిహద్దు భద్రతాదళం బీఎస్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌తో ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దు వద్ద బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (యాక్టింగ్‌) దల్జీత్‌సింగ్‌ చౌదరి ఇతర సీనియర్‌ కమాండర్లు కోల్‌కతా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బలగాలను క్షేత్రస్థాయిలో ఉంచాలని, అందరినీ వెంటనే విధుల్లో దించాలని ఫీల్డ్‌ కమాండర్లకు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులో పోస్ట్‌ చేసిన భద్రతా సిబ్బంది సెలవులను రద్దు చేశారు. బంగ్లాదేశ్‌తో భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇందులో పశ్చిమబెంగాల్‌ 2,217 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నది. త్రిపుర 856, మేఘాలయ 443, అసోం 262, మిజోరం 318 కిలోమీటర్లు సరిహద్దును కలిగి ఉన్నది.

అవామీ లీగ్‌ కార్యాలయం దగ్ధం

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చి ఆందోళనకారులు.. ధన్‌మోండీలోని షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఇదే ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్‌ హోం మంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమాల్‌ ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న వేల మంది ఆందోళనకారులు.. ఒక్కసారిగా గేట్లను బద్దలు కొట్టుకుని ఇంటిలోకి ప్రవేశించారు.

 

త్రిపురకు పారిపోయే యత్నాల్లో అవామీ లీగ్‌ నేతలు, ఎంపీలు

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌ నాయకులు, మద్దతుదారులు, ఎంపీలు కూడా దేశం వదిలి పారిపోతారని తెలుస్తున్నది. రానున్న 48 గంటల్లో వారు త్రిపురలోకి చొరబడే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి.