విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం కలకలం రేపింది. అమెరికా వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటన నుంచి ట్రంప్ సహా ఆయన సతీమణి మెలానియాతోపాటు ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, రక్షణశాఖ మంత్రి పీట్ హెక్సెత్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోలు క్షేమంగా బయటపడ్డారు. ట్రంప్ సహా వారంతా ఉన్న బాల్ రూమ్ లోపలికి వెళ్లేందుకు దుండుగుడు ప్రయత్నించే క్రమంలో భద్రతాధికారులపై ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడి కాల్పులలో ఒక భద్రతాధికారి గాయపడ్డారు. కాల్పుల సమయంలో సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రత అధికారులు బ్యాంకెట్ హాల్‌లోకి దూసుకరావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణ భయంతో వందలాది మంది అతిథులు అక్కడి టేబుల్స్ కింద దాక్కున్నారు. భద్రతాధికారులు వెంటనే ట్రంప్ సహా అక్కడున్న ప్రముఖులందరిని సురక్షితంగా తరలించారు.
దాడి చేసిన వ్యక్తి కోల్ థామస్
ట్రంప్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి కాలిఫోర్నియాకు చెందిన 31ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే టీచర్‌గా గుర్తించారు. ఎఫ్ బీఐ అధికారులు అతడిని బంధించి విచారిస్తున్నారు. ట్రంప్ పై హత్యాయత్నం ఇది నాల్గవ సారి కావడం గమనార్హం. దుండగుడు షాట్ గన్, పలు కత్తులతో హోటల్ లోని ట్రంప్ బాల్ రూమ్ లోకి ప్రవేశించేందుకు యత్నించాడు
మేం సురక్షితం : ట్రంప్
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దుండుగుడు కోల్ థామస్ జరిపిన కాల్పుల ఘటన నుంచి నాతో పాటు జేడి వాన్ సహా అంతా క్షేమంగా బయటపడ్డామని డోనాల్డ్ ట్రంప్ మీడియాకు వెల్లడించారు. ఒక భద్రతాధికారి గాయపడ్డారని, అతను కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. కాల్పుల సందర్భంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు వేగంగా, ధైర్యంగా స్పందించి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. వెంటనే అక్కడి నుంచి తనతో పాటు మెలానియా, జేడీవాన్స్, క్యాబినెట్ సభ్యులందరినీ తరలించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు అని, గతంలో రిపబ్లికన్లపై దాడులు జరిగాయని తెలిపారు. మరో 30 రోజుల్లో ఈ డిన్నర్‌మీట్‌ను రీషెడ్యూల్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తన అధ్యక్షపదవి ప్రమాదాలతో కూడుకున్నదన్న విషయం స్పష్టంగా తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను భయపడుతూ బతికే రకం కాదని ఆయన వెల్లడించారు. మార్కో రూబియో, పీట్ హెగ్సెత్‌లు తనకు ఈ పదవిలో ఉన్న ముప్పులగురించి ముందే చెప్పారన్నారు. వాస్తవానికి కాల్పుల ఘటన అనంతరం తాను హోటల్‌లోనే ఉండి డిన్నర్‌ను కొనసాగిస్తానని పట్టుబట్టానని, భద్రతాధికారులు అంగీకరించకుండా అక్కడి నుంచి తమ అందరిని తరలించారని ట్రంప్ తెలిపారు.
భద్రతా వైఫల్యంపై రచ్చ
అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ సమావేశంలోకి ఓ ఆగంతకుడు ఎలా ప్రవేశించగలిగాడన్న చర్చ ఇప్పుడు అమెరికాలో రచ్చ రేపుతుంది. ప్రపంచంలోనే అత్యంత భద్రతా వ్యవస్థ ఉండే అమెరికా అధ్యక్షుడి సమీపంలోకి ఓ ఆగంతుకుడి ఆయుధాలతో ప్రవేశించడం భద్రతా వైఫల్యాలను బట్టబయలు చేస్తుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వరుస యుద్దాలతో అందరిని ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పట్ల అమెరికన్లలో పెరిగిపోయిన అసంతృప్తికి ఈ ఘటన ఓ నిదర్శనంగా కూడా చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ పై కాల్పుల ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందా? ఈ ఘటన ఇరాన్ – అమెరికాల మధ్య శాంతి చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
President Trump and Vice President JD Vance were rushed off the stage after shots were fired at the White House Correspondents’ Dinner.#news pic.twitter.com/YQuG8gzTMf
— MS NOW (@MSNOWNews) April 26, 2026
