Donald Trump | గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కొత్త వ్యూహం.. పౌరులకు డబ్బు ఆఫర్‌..?

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునేందుకు ట్రంప్‌ టీమ్‌ కొత్త వ్యూహం రచిస్తోంది. పౌరులకు డబ్బు ఆఫర్‌ చేయాలన్న యోచనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jan 09, 2026, 3:58 pm IST
Read Time: 6 mins
Donald Trump | గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కొత్త వ్యూహం.. పౌరులకు డబ్బు ఆఫర్‌..?

Donald Trump | గ్రీన్‌లాండ్‌ (Greenland)పై ట్రంప్‌ (Donald Trump) వైఖరి మారడం లేదు. దాన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంతేగాక‌ ఆర్కిటిక్ ప్రాంతంలోని తమ భూభాగంలోకి ఎవరైనా అడుగుపెడితే, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా వెంటనే కాల్పులు జరపాలని తమ సైనికులకు ఆదేశాలున్నాయని డెన్మార్క్ హెచ్చరించింది కూడా. అయినప్పటికీ ట్రంప్‌ వెనక్కి తగ్గడం లేదు. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునేందుకు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకునేందుకు ట్రంప్‌ టీమ్‌ సరికొత్త ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 57,000 మంది జనాభా కలిగిన ఈ ద్వీపాన్ని సొంతం చేసుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు టాక్‌. డెన్మార్క్‌ నుంచి విడిపోయి అమెరికాలో చేరేలా అక్కడి ప్రజలను (Greenland Citizens) ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొంత డబ్బును కూడా ఆఫర్‌ చేసే యోచనలో ట్రంప్‌ టీమ్‌ ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గ్రీన్‌లాండ్‌ వాసులను ఆకర్షించేందుకు అమెరికా డబ్బు ఆశజూపుతోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. ఒక్కొక్కరికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు ఇచ్చేందుకు యూఎస్‌ అధికారులు సిద్ధమైనట్లు పేర్కొంది. ఇందుకోసం దాదాపు 6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.

ముందు తూటా.. తర్వాతే మాట..

గ్రీన్‌లాండ్‌ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే దశాబ్ద కాలంగా సైనిక పాలనలో ఉన్న డానిష్‌ సైనికులు ముందు కాల్చులు జరిపి ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతారు. ఇది డెన్మార్క్‌ చేసిన హెచ్చరిక కాదు. 1952లో చేసిన నిబంధన. ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా తక్షణమే శత్రు సేనలపై కాల్పులు జరపాలన్నది డానిష్‌ సైనికులకు అమలులో ఉన్న ఆదేశాలు. ప్రాంతంలో రష్యా, చైనా సేనల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే తన ఆకాంక్షను బయటపెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ నిబంధనను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.

ఆ నిబంధన అమల్లోనే ఉంది

1952లో చేసిన నిబంధన ప్రకారం దురాక్రమణ జరిగిన సందర్భంలో పైస్థాయి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా శత్రు సైనికులపైకి డెన్మార్క్‌ సైనికులు ఏమాత్రం ఆలోచించుకోకుండా వెంటనే కాల్పులు ప్రారంభించాలి. ఈ నిబంధన ఇప్పటికీ అమలులో ఉందని డానిష్‌ రక్షణ శాఖ బుధవారం డానిష్‌ వార్తాపత్రిక బెర్లింగ్‌స్కేకి ధ్రువీకరించింది. ఈ ప్రకటనతో గ్రీన్‌లాండ్‌ స్వాధీనంపై ట్రంప్‌ తన రూట్‌ మార్చినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Raja Saab | ‘ది రాజాసాబ్’లో అసలు ట్విస్ట్ ఇదేనా? ముగ్గురు కాదు… ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు!
Sweet City of India | స్వీట్‌ సిటీ ఆఫ్‌ ఇండియా అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?