The Raja Saab Review | ది రాజా సాబ్ రివ్యూ: మెరిసిన వింటేజ్​ ప్రభాస్​ : మరి రాజా వారి కథేమిటి?

‘ది రాజా సాబ్’లో ప్రభాస్ నటన, కొన్ని దృశ్యాలు బాగున్నా, కథనం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉండడం వల్ల సినిమా పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి.  కానీ మొత్తం మీద ఇది మిక్స్‌డ్ ఫీలింగ్ ఇచ్చే చిత్రం. ఫాంటసీ–హారర్ సెటప్ ఆసక్తికరంగా ఉన్నా, దాన్ని సక్రమంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. అభిమానులకు కూడా కొన్ని భాగాలే నచ్చినట్లున్నాయి.

The Raja Saab Review | ది రాజా సాబ్ రివ్యూ: మెరిసిన వింటేజ్​ ప్రభాస్​ : మరి రాజా వారి కథేమిటి?

The Raja Saab Review: Prabhas Leads a Mixed Fantasy Ride

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ యాక్షన్ ప్రపంచాల్లోనే ప్రయాణిస్తున్న సమయంలో, ‘ద రాజా సాబ్’ ఒక విభిన్నమైన ప్రయోగం. హారర్, ఫాంటసీ, కామెడీ, ఫ్యామిలీ డ్రామా అన్నింటినీ కలిపిన మిక్స్డ్​ బిర్యానీ ఇది. కథకు మూలమైన అంశం మాత్రం చాలా భావోద్వేగపరమైనది — నాన్నమ్మకి జరిగిన అన్యాయం, మనవడు వాస్తవాన్ని బయటపెట్టి న్యాయం చేయడం.

ఇంతకీ ఈ రాజావారి కథేమిటో..?

కథ ఓ చిన్న గ్రామంలో మొదలవుతుంది. దేవనగర సామ్రాజ్యానికి ఒకప్పటి రాణి అయిన గంగాదేవి ఇప్పుడు సాధారణ మహిళ. మతిమరుపుతో బాధపడుతూ, ఎన్నో విషయాలు మర్చిపోతున్నా, తన జీవితాన్ని తలకిందులు చేసిన వ్యక్తి, భర్త కనకరాజు గురించిన జ్ఞాపకం మాత్రం తొలగిపోదు. ఈ నాన్నమ్మని చూసుకుంటూ, ఆమెకోసం ఏదైనా చేయాలన్న తపనతో  ఉండే మనవడు రాజు అలియాస్ రాజాసాబ్.  సరదా, అమాయకం, ప్రేమకోసం ఏదైనా చేసే మనసున్న యువకుడు. ఒక ఫోటో ద్వారా కనకరాజు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకున్న రాజు, నాన్నమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు బయలుదేరతాడు. అక్కడి నుంచి హీరో కథలోకి ముగ్గురు అమ్మాయిలు అడుగుపెడతారు — తన నిర్భయమైన లవ్ ఎక్స్‌ప్రెషన్‌తో భైరవి, నన్ కావడానికి సిద్ధమయినా ప్రేమలో పడిపోయే బ్లెస్సీ, రాజును అభిమానించే అనిత. ఈ మూడు ట్రాక్‌లు కథకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, రాజు జీవితంలోని అయోమయాన్ని తెలియజేస్తాయి.

The Raja Saab Telugu movie VIDHAATHA review featuring Prabhas in a fun, emotional moment with Zarina Wahab as grandmother pulling his cheeks.

కథలో అసలు వేగం అందుకునేది నర్సాపూర్ అడవిలో రాజు అడుగు పెట్టినప్పటినుండి. అక్కడ ఉన్న పురాతన రాజమహలే ఈ కథకు కోట. ఆ కోట రకరకాల అడ్డంకులతో, భయంకరమైన రహస్యాలతో, వింత శక్తులతో నిండి ఉంటుంది.  రాజుకు తన తాత ఇక్కడే ఉన్నాడని తెలుస్తుంది. అది కూడా ఒక భయంకరమైన, శక్తివంతమైన ఆత్మరూపంలో. నానమ్మ కోసం వచ్చిన మనవడిని రకరకాల మైండ్​ గేమ్​లతో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటుంది కనకరాజు ప్రేతాత్మ.

అప్పుడు  ప్రవేశించిన మానసిక శాస్త్ర నిపుణుడు డాక్టర్ పద్మభూషణ్  సహాయంతో రాజు తనలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి, తాత  ఫాంటసీ ప్రపంచంలో అడుగు పెడతాడు. ఇక అప్పటినుంచీ తాతకు చెలగాటం, మనవడికి ప్రాణసంకటం.  నీడల దాడులు, మాయలతో నిండిన గదులు, రహస్య భూగర్భ మార్గాలు, సైకలాజికల్ వార్… ఇవన్నీ సినిమాలో ఆకట్టుకునే ఎపిసోడ్లు. ఇంకా ఇదే సమయంలొ వచ్చే తాతామనవళ్ల ముచ్చట్లు, తెలివితేటల యుద్ధాలు సినిమాకు మంచి ఊపునిస్తాయి.

అసలు కనకరాజుకు గంగాదేవి ఎలా కలిసింది? తర్వాత కనకరాజు ఆ రాజ్యంలో ఏం చేసాడు? అసలు ఆ రాజమహల్​లో ఏముందని తెలుసుకునే ప్రయత్నంలో రాజుకు అసలు విషయాలన్నీ అర్థమవుతాయి. ఇక అక్కన్నుంచీ నానమ్మను కాపాడటానికి, తాతను ఎదిరించడానికి రాజు చేసే ప్రయత్నాలే మిగతా కథ.

బలాలు – బలహీనతలు

ఇంత బలమైన క్యారెక్టర్లు, భావోద్వేగం, ఫాంటసీ డ్రామా ఉన్నా వాటిని ధృడంగా సమన్వయం చేయడంలో  బలహీనమవడంతో సినిమా మొత్తం ఫోకస్ కోల్పోయింది. మొదటి భాగంలో కథనం చాలా స్లోగా నడవడం, రెండో భాగంలో మూల కథ పక్కదారి పట్టడం వల్ల ప్రేక్షకుల అసహనానికి గురవుతారు. కథలో మంచి ఎమోషనల్​ పాయింటున్నా, సరిగ్గా మలిచిఉంటే  సినిమా రేంజ్ వేరేలా ఉండేదనే అభిప్రాయమైతే ఉంది. అసలు సమస్యల్లా మారుతి తాపత్రయం. పెద్ద హీరోను ఎలా హ్యాండిల్​ చేయాలో అనుభవం లేకపోవడం పెద్ద మైనస్​. ప్రేమ కథాచిత్రం లాంటి హర్రర్​ కామెడీని అద్భుతంగా తీసిన మారుతి, దీన్ని బలంగా నిలబెట్టడంలో అయోమయానికి గురయ్యాడు. అభిమానులను అలరించే సీన్లు కూడా పెద్దగా లేవు.

నటీనటులు, సాంకేతిక విభాగాల పనితీరు

Prabhas and Nidhhi Agerwal in a romantic song sequence from The Raja Saab with bright outdoor visuals.

ప్రభాస్ మాత్రం సినిమాకే హైలైట్. చాలా రోజుల తర్వాత నార్మల్​ ప్రభాస్​ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. వింటేజ్ కామెడీ టైమింగ్, స్టైల్, భావోద్వేగ సన్నివేశాల్లో నటన చాలా బాగున్నాయి.  కొన్ని సన్నివేశాల్లో ఆయన తెర మీద ఉండటంవల్లే  సినిమా మొత్తానికి ప్రాణం వచ్చింది. ఇక నానమ్మ పాత్రలో జరీనా వహబ్ చిత్రానికి గుండెకాయ వంటిది. మనవడితో అనుబంధం, భావోద్వేగం, మనసులోని బాధ, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో తన ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. హీరోయిన్లు (మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్)
అందంగా కనిపించినా, పాత్రలకు సరైన ప్రాముఖ్యత లేకపోవడం వల్ల వారి సన్నివేశాలు కథలో సరిగా ఇమడలేకపోయాయి.  వీరిలో కాస్తా మాళవికకు స్క్రీన్ టైమ్ ఎక్కువ, ఒక యాక్షన్ సీన్‌లో కూడా మెరిసింది. నిధి పాటలలో ఆకర్షణీయంగా కనిపించింది; రిద్ధి పాత్ర చిన్నదిగా, ప్రభావం తక్కువగా ఉంది.

సాంకేతికంగా —
కార్తీక్ పలాని కెమెరా కొన్ని అద్భుతమైన ఫ్రేములు ఇచ్చినా నిలకడ లేకపోయింది. గ్రాఫిక్స్​ గజిబిజిగా ఉండి గ్రీన్ మ్యాట్ కూడా కనబడుతుండటంతో ప్రేక్షకులు ఇబ్బందికి గురయ్యారు. తమన్ సంగీతం కొన్ని చోట్ల సంగీతంలాగే ఉన్నా ఎక్కువ చోట్ల శబ్ద కాలుష్యం​లా ఉంది.

మొత్తం మీద కథాపరంగా మంచి స్కోప్​ ఉన్నా స్క్రీన్‌ప్లే లోపాల వల్ల సినిమా ఒక కంప్లీట్​ ఫీలింగ్​ను ఇవ్వలేకపోయింది. ఒక విధంగా ఇది పూర్తి ప్రభాస్​ వన్​ మ్యాన్​ షోగా ఉంది.

విధాత రేటింగ్​ : 2.75/5