విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్ ను యూకే కోర్టు న్యాయమూర్తి ప్రశంసించిన ఘటన వైరల్ గా మారింది. బారెన్ ట్రంప్ తన గర్లఫ్రెండ్ ను కాపాడటంలో సకాలంలో స్పందించి పోలీసులకు ఫోన్ చేయడంతోనే ఆమె ప్రాణాలతో బయటపడిందని యూకే నార్త్ ఈస్ట్ లండన్ కోర్ట్ న్యాయమూర్తి అతడిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…. రష్యాకు చెందిన బాధిత యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ రుమియాంత్సేవ్ లు సోషల్ మీడియాలో పరిచయమై స్నేహితులుగా మారారు. వారిద్దరు కొన్నేళ్లుగా లండన్ లో నివాసం ఉంటున్నారు.
బాధిత రష్యా యువతి కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్ తో స్నేహం చేస్తుంది. అది నచ్చని ఆమె బాయ్ ఫ్రెండ్ రుమియాంత్సేవ్ ఆమెపై కోపం పెంచుకుని ఓ రోజు చితక్కొట్టాడు. ఆ సమయంలో బారెన్ ట్రంప్ వీడియో కాల్ ద్వారా ఆమెపై జరుగుతున్న దాడిని చూశాడు. వెంటనే బారెన్ యూకే పోలీసులకు ఫోన్ చేశాడు. అమెరికా నుంచి యూకే ఎమర్జెన్సీ నంబర్ 999కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. తనకు బాగా కావాల్సిన స్నేహితురాలిపై ఓ వ్యక్తి దాడి చేస్తున్నాడని, ఆమెను కాపాడాలని పోలీసులను కోరాడు. తన స్నేహితురాలికి వీడియో కాల్ చేయగా.. చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి ఆమెను తీవ్రంగా కొట్టాడని బారెన్ పోలీసులకు చెప్పాడు. నేను ఎనిమిది నిమిషాల క్రితం ఆ అమ్మాయిపై దాడి జరుగుతుండగా చూశానని.. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాఉందో తెలియదు అని ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని రక్షించారు. నిందితుడు రుమియాంత్సేవ్‌ను అరెస్టు చేశారు.
ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనపై ఇటీవల నార్త్‌ఈస్ట్ లండన్ కోర్ట్‌లో ఈ కేసు విచారణ జరిగింది. బారెన్ ట్రంప్‌తో ఆ యువతి స్నేహం చేయడంపై అసూయ పెంచుకున్న రుమియాంత్సేవ్.. ఆమెపై దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధిత రష్యా యువతిపై తీవ్రంగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినందుకు నిందితుడు రుమియాంత్సేవ్‌ని దోషిగా తేల్చిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సకాలంలో పోలీసులకు బారెన్ ట్రంప్ చేసిన ఫోనే ఆమె ప్రాణాలు కాపాడిందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను కాపాడేందుకు సాయం చేసిన ట్రంప్ కుమారుడిని జడ్జి ప్రత్యేకంగా అభినందించారు.
“బారన్ వల్లే నేను బ్రతికున్నాను : బాధితురాలు
కేసు విచారణ సందర్బంగా కోర్టులో బాధిత రష్యా యువతి వాంగ్మూలం ఇస్తూ కన్నీటి పర్యంతమైంది. “ఆ రోజు బారన్ సరైన సమయంలో పోలీసులకు కాల్ చేయకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. అతను నా పాలిట దైవంలా మారాడు” అని పేర్కొంది. దాడికి ముందు బారన్ ఆమెకు కొన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చారని, దాడి జరిగినప్పుడు భయంతో ఫోన్ తీయగానే బారన్ నంబర్ కనిపించడంతో వెంటనే వీడియో కాల్ చేశానని ఆమె వివరించింది.
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న నెటిజన్లు…..మొత్తం మీద తండ్రి డోనాల్డ్ ట్రంప్ యుద్దాలతో ప్రపంచంలో అలజడి రేపుతుంటే..కుమారుడు బారెన్ ట్రంప్ మాత్రమే ఫోన్ కాల్స్ సహాయంతోనే ఆపదలో ఉన్నవారిని కాపాడటం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
CKYC | ఈ ఒక్క నంబర్ ఉంటే చాలు.. ప్రతిసారి ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!
Snow in Desert | ఎడారి దేశంలో మంచు తుపాన్.. UAEలో వడగండ్ల వానలతో ఆశ్చర్యంలో ప్రజలు!
