CKYC | ఈ ఒక్క నంబర్ ఉంటే చాలు.. ప్రతిసారి ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!
CKYC | బ్యాంకుల్లో అకౌంట్ తెరిచినప్పుడు లేదా ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించాల్సిన వచ్చినప్పుడు కేవైసీని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీకేవైసీ తీసుకొచ్చింది. ఒక్కసారి ఇది పూర్తి చేస్తే ప్రతిసారి బ్యాంకుల చుట్టూ కేవైసీ అంటూ ఆధార్, పాన్ కార్డులు పట్టుకుని తిరగాల్సిన అవసరమే ఉండదు.
CKYC | కేవైసీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. బ్యాంకుల్లో ఖాతా తెరవడం నుంచి మొదలుపెడితే వివిధ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించిన ప్రతిసారి కేవైసీ చేసుకోమని చెబుతుంటారు. దీనికోసం ప్రతిసారి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోగ్రాఫ్ కాపీలను ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల చాలా సమయం వృథా అవ్వడమే కాకుండా.. మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియను మరింత ఈజీగా, సెక్యూర్‌గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదే సీకేవైసీ. అసలు సీకేవైసీ అంటే ఏంటి? దీనివల్ల లాభమేంటి? అది ఎలా పనిచేస్తుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
C-KYC అంటే ఏంటి?
సాధారణంగా మనకు కేవైసీ, ఈ కేవైసీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ సీకేవైసీ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. సీకేవైసీని సెంట్రల్ నో యువర్ కస్టమర్ అని పిలుస్తారు. ఇది ఒక కేంద్ర డేటాబేస్ విధానం. దీనిని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(CERSAI) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఒక్కసారి మీ కేవైసీ వివరాలను నమోదు చేస్తే వివిధ చోటుల్లో వాడుకోవచ్చు. అంటే ప్రతి బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థలకు మళ్లీ మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. సీకేవైసీ నంబర్ ఇస్తే సరిపోతుంది.
CKYC గురించి కీలక విషయాలు
ఇది కేంద్ర డేటాబేస్.. అంటే కేవైసీ వివరాలను ఒకే చోట నిల్వ చేసే ప్రదేశం. ఇందులో ఒక్కసారి నమోదు చేస్తే 14 అంకెలతో కూడిన ప్రత్యేక నంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ఉంటే వివిధ బ్యాంకుల్లో ఖాతా తెరిచినప్పుడు లేదా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సమయంలో కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. సీకేవైసీ నంబర్ సమర్పిస్తే ఆటోమేటిక్‌గా పాన్‌కార్డు, ఆధార్ కార్డు అప్‌డేట్ అయిపోతుంది. దీనివల్ల మన డాక్యుమెంట్లు, వ్యక్తిగత వివరాలకు భద్రంగా ఉంటాయి.
సీకేవైసీ ఎలా పూర్తి చేయాలి?
ముందుగా బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థల్లో సీకేవైసీ ఫామ్ నింపాలి. దానితో ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, ఫొటో వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. అప్పుడు సదరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ వివరాలను ధృవీకరించి సీకేవైసీ రిజిస్ట్రీకి పంపిస్తుంది. ధృవీకరణ తర్వాత మీకు సీకేవైసీ నంబర్ అందుతుంది. సీ కేవైసీ నంబర్‌నే KIN (KYC Indentifier Number) అని పిలుస్తారు.
సీకేవైసీ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి.
అధికారిక CKYC పోర్టల్‌లోకి వెళ్లి పాన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా సీకేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. లేదనుకుంటే.. మీ రిజిస్టర్‌డ్ మొబైల్ నుంచి 7799022129 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మెసేజ్ రూపంలో సీకేవైసీ వివరాలను పొందవచ్చు. మీ సీకేవైసీ నంబర్ జనరేట్ అయ్యి ఉంటే.. 14 అంకెల KIN నంబర్‌తో మెసేజ్ వస్తుంది. ఒకవేళ జనరేట్ కాకపోతే.. జనరేట్ ఎలా చేసుకోవాలో చెప్పే ప్రాసెస్‌ను మెసేజ్ రూపంలో పంపిస్తారు.
లాభమేంటి?
బ్యాంకింగ్ సేవలను త్వరగా పొందగలం. మన డేటా కూడా భద్రంగా ఉంటుంది. అదెలా అంటే.. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, ఇతర కేవైసీ పత్రాలు సమర్పించే ఆర్థిక కార్యకలాపాల్లో సీకేవైసీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఫిజికల్‌గా ఆధార్, పాన్ కార్డు కాపీలను ఇవ్వాల్సిన పనిలేదు. దీనివల్ల ప్రతిసారి కేవైసీ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మన డేటా కూడా భద్రంగా ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram