గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికా కొత్త రూల్​తో భారతీయుల్లో టెన్షన్

అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం కొత్త విధాన పత్రం జారీ చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఇకపై చాలా సందర్భాల్లో స్వదేశానికి వెళ్లి కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా గ్రీన్​ కార్డుకు దరఖాస్తు చేయాల్సి రావచ్చని తెలిపింది.

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికా కొత్త రూల్​తో భారతీయుల్లో టెన్షన్ గ్రీన్ కార్డ్ కోసం తాత్కాలిక వీసాదారులు స్వదేశం నుంచే దరఖాస్తు చేయాలన్న అమెరికా కొత్త విధానం చర్చనీయాంశంగా మారింది.

US Green Card Rules Tightened: Temporary Visa Holders Asked To Apply From Home Country

సారాంశం

అమెరికా గ్రీన్​ కార్డ్​ దరఖాస్తులపై USCIS కొత్త పాలసీ మెమో జారీ చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఇకపై చాలా సందర్భాల్లో స్వదేశానికి వెళ్లి కాన్సులర్​ ప్రాసెసింగ్​ ద్వారా దరఖాస్తు చేయాల్సి రావచ్చని తెలిపింది. Adjustment of Statusను సాధారణ మార్గంగా కాకుండా ప్రత్యేక ఉపశమనంగా మాత్రమే పరిగణించనున్నట్లు పేర్కొంది.

 

హైలైట్ పాయింట్లు

  • గ్రీన్​ కార్డ్​ నిబంధనల్లో మార్పు
  • AOS ఇక ప్రత్యేక ఉపశమనం
  • స్వదేశం నుంచే కాన్సులర్​ ప్రాసెసింగ్​
  • భారతీయ వీసాదారులకు కొత్త టెన్షన్​

విధాత భారత్​ డెస్క్​ – మే 23, 2026:

హైదరాబాద్​: అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగిలేలా కొత్త పాలసీ మార్పు తెరపైకి వచ్చింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు అక్కడి నుంచే శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. ఇప్పటివరకు చాలామంది విద్యార్థి, ఉద్యోగ, పర్యాటక లేదా ఇతర తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండగానే Adjustment of Status ద్వారా గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించేవారు. అయితే తాజా ప్రభుత్వ(US Citizenship and Immigration Services) పాలసీ ప్రకారం, ఈ మార్గాన్ని ఇకపై సాధారణ ప్రక్రియగా కాకుండా “extraordinary form of relief”గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది.

దీంతో తాత్కాలికంగా అమెరికాలో ఉన్న విదేశీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలంటే, చాలా సందర్భాల్లో తమ స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్ ద్వారా ప్రాసెసింగ్ పూర్తి చేయాల్సి రావచ్చని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, H-1B వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాదారులు, అమెరికాలో దీర్ఘకాలంగా గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికాలో నుంచే గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు కఠిన షరతులు

US green card and passport documents on immigration office desk with American flag

అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనల్లో మార్పులతో తాత్కాలిక వీసాదారుల్లో కొత్త ఆందోళన నెలకొంది.

అమెరికా పౌరసత్వ మరియు వలసదారుల సేవా సంస్థ(US Citizenship and Immigration Services – USCIS) జారీ చేసిన తాజా పాలసీ మెమో ప్రకారం, అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉన్న వ్యక్తి గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటే సాధారణంగా Department of State ఆధ్వర్యంలోని కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా, అంటే అమెరికా వెలుపల నుంచే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. Adjustment of Status అనేది చట్టపరంగా అధికారుల వివేచనాధికారానికి లోబడి ఉండే ప్రత్యేక ఉపశమనంగా మాత్రమే చూడాలని USCIS పేర్కొంది.

ప్రతి కేసును విడివిడిగా పరిశీలించాలని, దరఖాస్తుదారుడి పరిస్థితులు, నేపథ్యం, చట్టపరమైన అర్హతలు, ఇతర సంబంధిత అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని USCIS అధికారులను ఆదేశించింది. అంటే గతంలోలాగా అమెరికాలో ఉంటూనే ఫారాలు సమర్పించి ప్రక్రియ కొనసాగించే మార్గం ఇకపై అందరికీ సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు.

USCIS ప్రతినిధి జాక్ కహ్లర్ మాట్లాడుతూ, తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు నిర్దిష్ట కాలం, నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే వస్తారని పేర్కొన్నారు. వారి అమెరికా ప్రవేశం, గ్రీన్ కార్డ్ ప్రక్రియకు మొదటి అడుగుగా మారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వదేశం నుంచే దరఖాస్తు చేయడం వల్ల తిరస్కరణ తర్వాత అక్రమంగా అమెరికాలో మిగిలిపోయే పరిస్థితులను తగ్గించవచ్చని USCIS వాదిస్తోంది.

భారతీయులపై ప్రభావం ఎంత?

US visa application document being stamped for immigration processing

అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ ప్రక్రియలపై కొత్త నిబంధనలు వలసదారుల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ మార్పు భారతీయులకు మరింత ప్రాధాన్యంగా మారింది. ఎందుకంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ లైన్​లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా EB-2, EB-3 ఉద్యోగ ఆధారిత కేటగిరీల్లో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది అనిశ్చితిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, H-1B ఉద్యోగులు, H-4 ఆధారిత కుటుంబ సభ్యులు, తాత్కాలిక వీసాలపై ఉన్నవారు భవిష్యత్ ప్రణాళికలను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సి రావచ్చు.

అయితే ఈ పాలసీ ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా వర్తిస్తుందా? ఇప్పటికే దరఖాస్తు చేసిన కేసులపై ప్రభావం ఉంటుందా? కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులు, ఉద్యోగ ఆధారిత దరఖాస్తులు, మానవతా కారణాల కేసులు ఎలా పరిగణించబడతాయి? వంటి అంశాలపై పూర్తి స్పష్టత కోసం ఇమ్మిగ్రేషన్ నిపుణుల సూచనలు కీలకం కానున్నాయి.

USCIS మాత్రం ఈ మార్పు ద్వారా తమ పరిమిత వనరులను మానవ అక్రమ రవాణా బాధితులు, హింసాత్మక నేరాల బాధితులు, నేచురలైజేషన్ దరఖాస్తులు వంటి ఇతర ప్రాధాన్యతా కేసులపై కేంద్రీకరించగలమని చెబుతోంది. మరోవైపు, వలసదారులకు సహాయం చేసే సంస్థలు మాత్రం ఈ నిర్ణయం కొంతమంది బలహీన వర్గాలకు ప్రమాదకరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, అమెరికా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఇది కీలక మలుపుగా కనిపిస్తోంది. తాత్కాలిక వీసాను శాశ్వత నివాస హోదాకు మార్గంగా ఉపయోగించే విధానంపై అమెరికా ప్రభుత్వం గట్టి నియంత్రణలు తీసుకురావాలనుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో చదువు, ఉద్యోగం, స్థిర నివాసం కలలుగంటున్న భారతీయులు ఇకపై ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలను మరింత ముందుగానే, న్యాయపరమైన సలహాతో రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.