అమెరికా-ఇరాన్‌ యుద్ధం ముగిసినట్లే !

అమెరికా, ఇరాన్ మధ్య 14 అంశాల శాంతి ఒప్పందంపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. హర్మూజ్ జలసంధి తెరుచుకోనుండటంతో చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక సంక్షోభాన్ని రేపిన అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన మధ్యంతర అవగాహన శాంతి ఒప్పందంపై పారిస్‌లో ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, మసూద్‌ పెజెష్కియాన్‌ లాంఛనంగా సంతకాలు చేశారు. యుద్ధం ముగింపునకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు. మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు షెహబాజ్‌ షరీఫ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్మూజ్‌ను ఇరాన్‌ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్‌ వెల్లడించారు.

14 అంశాలతో కూడిన ఒప్పందానికి ‘ఇస్లామాబాద్‌ మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ బిట్వీన్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అండ్‌ ద ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌’ అని పేరు పెట్టారు. అందులో యురేనియం అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాగే లెబనాన్‌నూ శాంతి ఒప్పందంలో భాగం చేశారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ ఘాలిబఫ్‌ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్‌, పెజెష్కియాన్‌ లు దీనిపై సంతకాలు చేయగా.. ఈ డీల్‌ తక్షణమే అమల్లోకి రానుంది. జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్‌ ప్యాలెస్‌ వేదికగా సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ విడుదల చేసింది.

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కీలక పోస్టు చేశారు. ‘ట్రంప్‌ వెర్సైల్స్‌లో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగుమం చేస్తుంది. హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయి’ అని మెక్రాన్‌ ఓ పోస్టులో రాసుకొచ్చారు. విందు అనంతరం ప్యాలెస్‌ నుంచి వెళ్తూ.. ఇరాన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ట్రంప్‌ విలేకరులతో పేర్కొన్నారు. వాస్తవానికి సంతకాల కార్యక్రమం రేపు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సి ఉండగా, ముందుగానే జరగడం గమనార్హం. ఒప్పందం మేరకు ఇరాన్ సేకరించిన యురేనియంను రెండు దేశాలు సంయుక్తంగా ధ్వంసం చేయనున్నాయి. అయితే, స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్‌ అధికారులు పేర్కొన్నారు. తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్‌ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ పేర్కొన్నారు. 60 రోజుల ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలను అమెరికా చేపట్టకూడదన్నారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం గానీ.. ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టంచేశారు.

ఒప్పంద అంశాలు..

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంలో భాగంగా లెబనాన్‌తోపాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపేస్తారు. అమెరికా, ఇరాన్‌లు వారి వారి సార్వభౌమాధికారాలను గౌరవించాలి.60 రోజుల్లో శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇద్దరికీ ఇష్టమైతే గడువును పొడిగించుకోవచ్చు.
30 రోజుల్లోగా హర్మూజ్‌ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. టోల్‌ లేకుండా నౌకలను ఇరాన్‌ అనుమతించాలి. ఇరాన్‌ పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వాముల అండతో 300 బిలియన్‌ డాలర్ల సాయం చేయాలి. ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలి.
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయకూడదు. శుద్ధి చేసిన యురేనియాన్ని రెండు దేశాలు కలిసి ధ్వంసం చేయాలి. అణు కార్యక్రమం విషయంలో స్టేటస్‌ కో మెయింటెయిన్‌ చేయాలి. ఆంక్షలను ఎత్తివేసే వరకూ ఇరాన్‌ చమురును స్వేచ్ఛగా విక్రయించుకోవడానికి అనుమతించాలి. ఎంవోయూ కాలంలో స్తంభింపజేసిన నిధులను ఇరాన్‌ పూర్తిగా వాడుకునేందుకు అనుమతించాలి. ఎంవోయూ అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎంవోయూ కాలంలో తుది ఒప్పందంపై చర్చలు జరగాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి తుది ఒప్పందం కట్టుబడి ఉండాలి.

Latest News