అమల్లోకి 50% టారిఫ్..భారత్ మిత్రదేశం అంటూనే టారిఫ్‌లతో బాదిన ట్రంప్
భారత్‌పై అమెరికా అదనపు టారిఫ్‌లు ఆగస్టు 27 అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచీ అమల్లోకి వచ్చాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు, సరుకులపై 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది

- అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని సరుకులపై సుంకాలు
- 66% ఎగుమతులపై ఎఫెక్ట్ ఏటా 7 బిలియన్ డాలర్ల నష్టం
- భారత్ మిత్రదేశం అంటూనే టారిఫ్‌లతో బాదిన ట్రంప్
వాషింగ్టన్ : భారత్‌పై అమెరికా అదనపు టారిఫ్‌లు ఆగస్టు 27 అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచీ అమల్లోకి వచ్చాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు, సరుకులపై 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా తమకు మంచి మిత్ర దేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల మోత మోగించారు. ఇండియాలో ఎక్కువ పన్నులుంటాయని తొలుత 25 శాతం పన్ను విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతో మరో 25 శాతం అదనపు పన్ను మోపారు. ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అమెరికాకు ఇండియా నుంచి వెళ్లే ప్రతి వస్తువుకు 50 శాతం పన్ను చెల్లించాలి. ఈ ట్యాక్స్ అమలు కావడానికి కొన్ని గంటల ముందే ఇండియాలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం
అమెరికా, ఇండియా మధ్య 2024 లో 129 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ తో భారత్ నుంచి చేసే ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాలు, ఆభరణాల రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇండియా నుంచి ఆరు వ్యవసాయ ఉత్పత్తులు సహా 30 రంగాలకు చెందిన ప్రొడక్ట్స్ అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఫార్మా, వస్త్ర పరిశ్రమ, టెలికం వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఆభరణాలు, రత్నాలు అమెరికాకు ఎగుమతుల ద్వారా రూ. 83 వేల కోట్లకు పైగా ఇండియా వ్యాపారం చేస్తోంది. ఇక ఫార్మా రంగంలో జెనరిక్ మెడిసిన్స్ ఇండియా నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. రూ. 66,800 కోట్ల పేటెంట్ లేని మందులు ఎగుమతి అవుతాయి. ఇండియాలోని ప్రముఖ ఫార్మా కంపెనీల ఆదాయంలో 30 శాతం అమెరికా నుంచి వస్తున్నది. 2022 రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 10 ప్రిస్కిప్షన్లలో నాలుగు ప్రిస్కిప్షన్లు భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీల మందులే. అయితే ఇది అమెరికా పౌరులకు రూ. 18.3 లక్షల కోట్లు ఆదా చేసింది. టారిఫ్ పెంపుతో అమెరికా ప్రజల మెడికల్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. 49.3 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి అవుతాయి.
మొబైల్స్, టెలికం, ఎలక్ట్రానిక్ పరికరాలు
మొబైల్స్, టెలికం, ఎలక్ట్రానిక్ పరికరాలు 14.39 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి. వీటిపై ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ టారిఫ్ వల్ల భారత్ ప్రతి ఏటా 7 బిలియన్ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని అంచనా. అంతేకాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్న ఉపాధిని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ఓ నివేదిక ప్రకారం భారత్ మొత్తం ఎగుమతుల్లో 66 శాతంపై టారిఫ్ ప్రభావం చూపుతాయి.