అమెరికా-ఇరాన్ మధ్య తదుపరి చర్చలు జెనీవాలో..!?
అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన నేపథ్యంలో తదుపరి విడత చర్చలు జెనీవా లేదా టర్కీలో జరిగే అవకాశం ఉందని సమాచారం.
విధాత : అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో మలిదశ చర్చల పురోగతిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్న మధ్యవర్తిత్వంతో 21 గంటల పాటు జరిగిన చర్చలు యుద్ద నివారణ దిశగా ఎలాంటి స్పష్టత లేకుండానే అర్థాంతరంగా ముగిశాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సైన్యానికి ఆదేశించారు. దీంతో హార్ముజ్ జలసంధి దగ్గర మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
జెనీవా వేదికగా తదుపరి చర్చలు !
పశ్చిమాసియా యుద్ద పరిస్థితులు కొనసాగుతన్న క్రమంలే అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య తదుపరి విడత చర్చలు ఈ వారం లేదా వచ్చే వారం ప్రారంభంలో జరగవచ్చని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ అధికారి తెలిపినట్లుగా రాయిటర్స్ నివేదించింది. అయితే ఈసారి చర్చలు టర్కీ లేదా జెనీవాలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో 80శాతం అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, ఒప్పందం దాదాపు కుదిరినట్లుగానే కన్పించిందని.. కాసేపటికే అవి విఫలమయ్యాయి అని పాక్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య ఈ స్థాయిలో అత్యున్నత స్థాయి సమావేశం ఇదే కావడం విశేషం. ఇస్లామాబాద్‌లోని లగ్జరీ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ సహా ఇరుదేశాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
అయితే అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పూర్తిగా నిలిచిపోలేదని, రెండోదశ ముఖాముఖి భేటీకి ఇరుదేశాలు సన్నాహాలు చేస్తున్నట్లు అప్పుడే వార్తలు వెలువడ్డాయి. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. డీల్ కుదుర్చుకునేందుకు తాము సుముఖంగానే ఉన్నామని ఇరాన్ తమతో చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే రెండు దేశాల మధ్య తదుపరి విడత శాంతి చర్చలు కొనసాగుతాయని సమాచారం.
అణు కార్యకలాపాల నిలిపివేతపైనే పీటముడి
పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లే కన్పించినా.. చివరి నిమిషంలో విఫలమవ్వడం తెలిసిందే. ఇందుకు కారణం అణు కార్యకలాపాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేనని తాజాగా వెల్లదైంది. . 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని యూఎస్ ప్రతిపాదన పెట్టగా, ఇరాన్ మాత్రం 5 ఏళ్ల పాటు నిలిపివేస్తామని చెప్పడంతో శాంతి చర్చలు స్తంభించాయని అమెరికా మీడియా కథనాలు వెలువడ్డాయి. వాస్తవానికి టెహ్రాన్ శాశ్వతంగా యురేనియం శుద్ధిని నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ముందునుంచీ డిమాండ్ చేసింది. కానీ చర్చల సమయంలో దాన్ని 20 ఏళ్లకు తగ్గించడం గమనార్హం. అయినప్పటికి టెహ్రాన్ అంగీకరించకపోవడం, హర్మూజ్ జలసంధి తెరవడంపై అభ్యంతరాలతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. తదుపరి చర్చల సందర్బంగానైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరపడాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.
యుద్ద నష్టం.. బాధ్యులైన దేశాలు ఇవ్వాలి : ఇరాన్
యుద్ధం వల్ల జరిగిన నష్టంపై ఇరాన్ ప్రాథమిక అంచనాలు వెల్లడించింది.. యుద్ధం వల్ల రూ.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇరాన్ తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని.. వాస్తవానికి తుది నష్టం ఇంతకంటే ఎక్కువే ఉండవచ్చని ఇరాన్ పేర్కొంది. అలాగే ఈ దాడులకు బాధ్యులైన దేశాల నుంచి పరిహారం కోరుతాం అని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా చైనా స్ట్రాంగ్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అగ్రరాజ్యం అమెరికా నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతూ ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ హెచ్చరికలు చేశారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని డాంగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. హర్మూజ్ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తుందన్నారు. ఈ వ్యవహారాల్లో అమెరికా లేదా ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా హెచ్చరించారు. జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని.. చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి :
బావిలో పడిన సింహం…రెస్క్యూ ఆపరేషన్ వైరల్ !
దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌గా ఏపీ : సీఎం చంద్రబాబు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram