Vladimir Putin | అమెరికా ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం.. ఉత్తరకొరియా పర్యటనకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Vladimir Putin | అమెరికా తమపై విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ'కి ఓ ఆర్టికల్‌ రాశారు. ఆయన ఇవాళ, రేపు (మంగళ, బుధవారాల్లో) ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు.

Vladimir Putin | అమెరికా ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం.. ఉత్తరకొరియా పర్యటనకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Vladimir Putin : అమెరికా తమపై విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ’కి ఓ ఆర్టికల్‌ రాశారు. ఆయన ఇవాళ, రేపు (మంగళ, బుధవారాల్లో) ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు.

అనేక విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయని పుతిన్‌ వెల్లడించారు. అందుకు ఐరాసలో అనుసరిస్తున్న ఉమ్మడి వైఖరిని ఉదహరించారు. తాజా పర్యటనతో ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని ఆయన ఆకాంక్షించారు. అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థలను సైతం అభివృద్ధి చేస్తామన్నారు.

పర్యాటక, సాంస్కృతిక, విద్యారంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేస్తామని పుతిన్‌ తెలిపారు. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని రష్యన్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. భద్రత, రక్షణకు సంబంధించిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం’ కూడా అందులో ఒకటని పేర్కొన్నాయి. ప్రధానంగా రక్షణపరమైన సహకారంపైనే ఇరు దేశాల ఒప్పందాలు ఉండనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అణ్వాయుధాల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా కఠిన ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు సరఫరా చేస్తోందని పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్నాయి. బాంబులు, క్షిపణులు సహా ఇతర సైనిక వ్యవస్థలను అందజేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తద్వారా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగేలా చేస్తోందని ఆరోపించాయి.

ఈ వాదనలను రష్యా, ఉత్తర కొరియా దేశాలు ఖండిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ ఉత్తర కొరియా పర్యటన, పర్యటనకు బయలుదేరే ముందు ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుతిన్‌ ఉత్తర కొరియా రావడం 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2000 సంవత్సరం జులైలో పుతిన్‌ మొదటిసారి ఉత్తర కొరియా వెళ్లి, నాటి అధ్యక్షుడైన కిమ్‌ తండ్రితో సమావేశమయ్యారు. అమెరికా నుంచి సవాళ్లు పెరుగుతున్నందున, వాటిని ఎదుర్కోవడానికి సైనిక సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియాలు భావిస్తున్నాయి.

అదే విషయమై పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు చర్చలు జరుపనున్నారు. పుతిన్‌ పర్యటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలధినేతలు సమావేశం కావడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కానీ వారి మధ్య బలపడుతున్న బంధమే ఆందోళన కలిగిస్తోందని అగ్రరాజ్య భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. ఇది కొరియా ద్వీపకల్పం సహా ప్రాంతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.