అమెరికా B-2 బాంబర్ అదృశ్యం?

ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై అమెరికా చేసిన హోరాహోరీ వైమానిక దాడుల తరువాత, B-2 స్టెల్త్ బాంబర్‌ బృందం ఒక్కటి అదృశ్యమైందన్న వార్తలు అమెరికా వాయుసేనలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి

అమెరికా B-2 బాంబర్ అదృశ్యం?
  • ఇరాన్‌పై దాడుల తర్వాత స్థావరానికి చేరుకోని వైనం
  • హవాయిలో ఒకటి అత్యవసర ల్యాండింగ్
  • మొత్తం ఎన్ని మాయమయ్యాయి?

B-2 Stealth Bomber missing | ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై అమెరికా చేసిన హోరాహోరీ వైమానిక దాడుల తరువాత, B-2 స్టెల్త్ బాంబర్‌ బృందం ఒక్కటి అదృశ్యమైందన్న వార్తలు అమెరికా వాయుసేనలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. మిస్సోరీలోని వైట్​మన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ నుంచి జూన్ 21న బయలుదేరిన రెండు బృందాల్లో ఒక బృందం తిరిగి బేస్‌కు చేరుకోకపోవడం చర్చనీయాంశమైంది.

(హొనలులూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన ఒక బి‌‌–2 బాంబర్​)

ఈ మిషన్‌లో ఒక బృందం పసిఫిక్ సముద్రం మీదుగా పశ్చిమాన ప్రయాణించగా, రెండవ బృందం ఏడు B-2 బాంబర్లతో తూర్పు వైపుగా ప్రయాణించి ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్ అణుశక్తి కేంద్రాలపై సమర్థవంతంగా దాడులు నిర్వహించింది.దాడులు నిర్వహించిన  రెండవ బృందం విజయవంతంగా తిరిగి వచ్చినప్పటికీ, మొదటగా బయలుదేరిన డికాయ్(శత్రువులను తప్పుదారి మళ్లించేందుకు ఉపయోగపడే) బృందం గురించి పూర్తి సమాచారం అందలేదు. ఈ బృందంలో ఎన్ని బి–2లు ఉన్నాయో కూడా తెలియదు.

హవాయిలో అత్యవసర ల్యాండింగ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోల ప్రకారం, స్టెల్త్ బాంబర్లలో ఒకటి హవాయి రాజధాని హొనలులు సమీపంలోని డేనియల్ కె. ఇనోయ్(Daniel K. Inouye International Airport) అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్​ అయినట్లు తెలుస్తోంది. ఇది హికామ్ ఎయిర్‌బేస్‌తో రన్‌వేలు పంచుకుంటుంది. విమానం ఎందుకు దారి మళ్లించబడిందన్న విషయంపై మాత్రం అధికారిక సమాచారం అందలేదు.

ఇదే మొదటిసారా?

ఇది B-2 బాంబర్లకు సంబంధించిన మొదటి అత్యవసర ల్యాండింగ్ కాదు. 2023లో కూడా ఇలాంటిదే ఒక ఘటన చోటు చేసుకోగా, అప్పట్లో అంతటి ప్రమాదం తరువాత బాంబర్ల మొత్తం బృందాన్నే తాత్కాలికంగా నిలిపివేసింది. అంతకుముందు 2021లో మరొక బాంబర్‌ను మరమ్మత్తుల కోసం నార్త్రోప్ గ్రుమన్(Northrop Grumman) ఫ్యాక్టరీకి తరలించాల్సి వచ్చింది.

2008లో గువాంలోని ఆండర్సన్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అనంతరం ‘స్పిరిట్ ఆఫ్ కాంసస్’ అనే B-2 బాంబర్ కూలిపోయిన ఘోర ప్రమాదం గుర్తుండే ఉంటుంది. అదృష్టవశాత్తూ ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

అణు వ్యూహాల్లో కీలకమైన B-2

సమకాలీన అమెరికా అణు వ్యూహాల్లో B-2 బాంబర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటి ప్రత్యేకత స్టెల్త్ టెక్నాలజీ, శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం. అయితే తరచుగా ఎదురవుతున్న అత్యవసర ల్యాండింగులు, యాంత్రిక లోపాలు ఇప్పుడు అమెరికా రక్షణ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.