New Pope | వాటికన్ కొత్త పోప్ ఆయనేనా? బుధవారం నుంచి కార్డినల్స్ కాంక్లేవ్
కొత్త పోప్ ఎంపికకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్.. సిస్టీన్ చాపెల్‌లోకి ప్రవేశించనున్నారు. అక్కడ జరిగే రహస్య కాంక్లేవ్‌లో కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు.

New Pope | ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్కులకు వాటికన్ సిటీ పోప్ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. అలాంటి పదవిలో ఇప్పటి వరకూ ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మరణించడంతో ఆయన వారసుడు ఎవరన్న చర్చ ఊపందుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ కార్డినల్స్.. కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. ఇటీవలి కాలంలో పోప్ జాన్ పాల్ II సుదీర్ఘకాలం పోప్‌గా ఉన్నారు. ఆయన మరణం తర్వాత జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. పోప్ జాన్ పాల్ II తర్వాత పోప్ బెనెడిక్ట్ XVI, పోప్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. తాజాగా ఫ్రాన్సిస్ మరణంతో మూడవ వరుస ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలో చర్చ్‌ను క్రమపద్ధతిలో నడిపించేందుకు, కొంత శాంతి కోసం కార్డినల్స్ చూసినట్టయితే.. పియట్రో పరోలిన్ సమర్థ ఎంపిక కాగలదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
పన్నెండేళ్లుగా వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పరోలిన్
గత పన్నెండేళ్లుగా పరోలిన్ వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నంబర్ టూ పొజిషన్ ఆయనది. వాటికన్ టాప్ డిప్లొమాట్ కూడా. ఈ రెండు పాత్రల్లో సమర్థంగా వ్యవహరించిన కారణంగా వాటికన్ పోప్ బాధ్యతకు ఆయనే ఎన్నికవుతారని దాదాపు అన్ని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. 70 ఏళ్ల వయసున్న పరోలిన్.. ఇటలీలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. కొత్త పోప్ ఎన్నికకోసం కార్డినల్స్ బుధవారం నుంచి సిస్టీన్ చాపెల్‌లోనికి ప్రవేశించనున్నారు. అక్కడ నిర్వహించే రహస్య కాంక్లేవ్‌లో చర్చోపచర్చల అనంతరం కొత్త పోప్ ఎన్నికవుతారు. ఈ కార్డినల్స్ రోమ్ సందర్శనకు వచ్చినప్పుడల్లా పరోల్‌ను తప్పకుండా కలిసేవారు. అందరు కార్డినల్స్ ప్రాతినిధ్యం వహించే దేశాలన్నింటిలోనూ పరోల్ దాదాపు పర్యటించారు.
ఆచరణాత్మకవాది
పరోలిన్.. ఇటు కన్జర్వేటివ్ కాదు.. ఇటు ప్రగతిశీల వాదీ కాదు. వాటికి మించి ఆచరణాత్మకవాదిగా పేరుపడ్డారు. గతంలో పోప్ ఫ్రాన్సిస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రగిలే మంటలను ఆయనే ఆర్పుతుండేవారు. 14 ఏళ్ల వయసులోనే మైనర్ సెమినరీలో చేరారు. 1980లో ఆయన మతబోధకుడయ్యారు. తన కెరీర్‌లో సుమారు సగ భాగం ఆయన వాటికన్ దౌత్య వ్యవహారాల్లోనే నిమగ్నమయ్యారు. అయితే.. ఆయన ఎప్పుడూ కాథలిక్ డియోసెస్‌కు అధిపతిగా పనిచేయలేదు. అది ఆయనకు మతపరంగా మరింత అనుభవాన్ని ఇచ్చి ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. ఆయన పనితీరు తెలిసినవారు మాత్రం.. అదేమంత లోపం కాదని అంటున్నారు. వాటికన్ వ్యవహారాలు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న సంబంధాలు అదనపు అర్హతగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Pope election | కొత్త పోప్ ఎంపికలో నల్ల పొగ, తెల్ల పొగలే కీలకం! అవి ఎలా తెప్పిస్తారంటే..
Pope election | కొత్త పోప్ ఎంపికలో హైదరాబాద్ కార్డినల్.. ఇండియా నుంచి ఇంకా ఎవరెవరు?