Widespread Protest Nepal | నేపాల్ ప్రభుత్వ అవినీతిపై ప్రజల ఆగ్రహాగ్ని.. ప్రధాని, అధ్యక్షుడి రాజీనామాలు..
ప్రభుత్వ అవినీతిపై రగిలిన యువత ఆందోళనలతో నేపాల్ మండిపోతున్నది. ప్రధాని, దేశాధ్యక్షుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటుకు నిప్పుపెట్టారు. ప్రధాని ఓలి దుబాయ్‌కు పారిపోయారు.

Widespread Protest Nepal | ప్రభుత్వంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి వ్యతిరేకంగా యువత సాగిస్తున్న ఆందోళనలతో హిమాలయ దేశం నేపాల్ అట్టుడికిపోతున్నది. సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో 19 మంది చనిపోవడంతో యువత ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ ఆందోళనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా పార్లమెంటు భవనాన్ని, దేశ అధ్యక్ష, ప్రధాన మంత్రి నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. మరోవైపు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధాన మంత్రి పీకే శర్మ ఓలి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆందోళనకారులు అనేక మంది మంత్రుల నివాసాలకు కూడా నిప్పుపెట్టారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత ఆగ్రహోదగ్రులయ్యారు. సోమవారం నాటి ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని తొలగించినప్పటికీ.. అవినీతి, సోమవారం నాటి మరణాలకు జవాబుదారీ కోసం యువత తమ నిరసనలు కొనసాగించారు. అల్లర్లను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలి.. తన బాధ్యతలను ఉప ప్రధానికి అప్పగించి.. దుబాయ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. ఆర్మీ సూచనల మేరకు ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. విదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతించిన ఆర్మీ.. ఆయనను దుబాయికి ప్రత్యేక విమానంలో పంపించివేసింది.
అదుపులోకి రాని అల్లర్లు..మంత్రుల వరుస రాజీనామాలు
అల్లర్లను అరికట్టేందుకు నేపాల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గేదేలే అంటూ పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలి, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ప్రైవేటు నివాసాల వద్దకు నిరసనకారులు పెద్ద సంఖ్యలో చేరుకుని వాటికి నిప్పు పెట్టారు. ప్రధాని ఓలి అధికారిక నివాసంపై దాడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ (ప్రచండ) నివాసంపైనా నిరసనకారులు దాడి చేశారు. పలువురు మంత్రుల నివాసాలకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. నేపాల్ ఆర్థిక మంత్రి, హోం మంత్రులపై ఆందోళన కారులు దాడులకు తెగబడ్డారు. రాజీనామా చేసిన హోం మంత్రి రమేశ్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా మంత్రులను వారి నివాసాల నుంచి మిలిటరీ ఖాళీ చేయించి, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
నిషేధం తొలగింపు
ప్రస్తుత అల్లర్లకు కారణమైన సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి పనిచేశాయి. అయితే.. యువతను ఆందోళనలకు సామాజిక మాధ్యమాలపై నిషేధం పురికొల్పినా.. ప్రభుత్వ అవినీతి అనేది కీలక అంశంగా ఉన్నది. జెన్ జీగా చెప్పే (1995–2010 మధ్యకాలంలో జన్మించినవారు ఈ ఆందోళనల్లో ఉన్నారని చెబుతున్నప్పటికీ.. ఇది దేశవ్యాప్త ఆందోళనగా మారిపోయింది. 2006లో రాజరికంపై చేసిన తిరుగుబాటు దర్వాత నేపాల్ పౌరులు, ప్రత్యేకించి యువత సుపరిపాలన, ఉపాధి అవకాశాలపై ఎంతో ఆశ పెట్టుకున్నారని నేపాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ రిసెర్చ్‌కు చెందిన సంతోష్ శర్మ పౌడెల్ చెబుతున్నారు. 2015లో దేశానికి కొత్త రాజ్యాంగాన్ని లిఖించుకున్న తర్వాత ఈ ఆశలు మరింత పెరిగాయని ఆయన అన్నారు. ‘అయితే.. ప్రభుత్వంలో అవినీతి భారీగా పరిగిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో గట్టిగా వేళ్లూనుకున్నది. అంతేకాదు.. అనేక మంది పొట్టచేతపట్టుకుని ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశం వదిలి వెళ్లిపోయారు. స్థోమత కలిగినవాళ్లు పశ్చిమదేశాలకు వెళ్లగా.. అంత స్థోమతలేనివాళ్లు మధ్య ఆసియా దేశాలకు వలసపోయారు’ అని ఆయన వివరించారు. నేపాల్ ప్రజల్లో ఆశ చనిపోయిందనేది ప్రధాన సెంటిమెంట్‌గా ఉందని ఆయన అన్నారు. 2008లో నేపాల్ దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటికీ.. కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నప్పటికీ వ్యవస్థ మారింది కానీ.. అందులో వ్యక్తులు మారలేదు. పాలన అలానే కొనసాగింది.. అదే సమయంలో అవినీతి బాగా పెరిగిపోయింది’ అని సంతోష్ శర్మ పౌడెల్ వివరించారు. నాయకులే దాడికి గురవుతున్నారంటే యువతలో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. వివిధ సంస్థలను తగులబెడుతున్నారంటే ఈ దేశంలో తమకంటూ ఏమీ లేదనే భావనతోనేనని చెప్పారు. అందుకే వారు పార్లమెంటును సైతం తగులబెట్టారని పేర్కొన్నారు. నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని ఎన్సీకి చెందిన గగన్ థాపా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘రాత్రంతా నిద్రపోలేదు. నేనే కాదు.. నేపాల్ మొత్తం ఇదే పరిస్థితి. బయట ఉన్న నేపాల్ వారూ కూడా నాకులా నిద్రపోలేదు. అమాయకులైన యువత అన్యాయంగా చనిపోతున్న దృశ్యాలు నా కళ్లముందు తిరుగాడుతూనే ఉన్నాయి. ప్రధాని దీనికి బాధ్యత తీసుకోవాలి. వెంటనే రాజీనామా చేయాలి. నేపాలీ కాంగ్రెస్ ఈ పరిస్థితిని మరొక్క రోజు కూడా చూస్తూ ఉండలేదు. ప్రభుత్వానికి నేపాలీ కాంగ్రెస్ వెంటనే మద్దతు ఉపసంహరించాలి’ అని ఆయన రాశారు.
ఆ ఇద్దరే కీలకం
నేపాల్‌లో ఇప్పుడు సాగుతున్న ఆందోళనలు యువత కేంద్రంగానే ఉన్నాయి. ప్రధానంగా మాలెన్ షా అనే 35 ఏళ్ల ర్యాపర్ (ఈయన కఠ్మాండు మేయర్ కూడా), రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రవి లమిచ్చెనె (49) (ఈయన 2024 మార్చి, జూలై నెలల మధ్య ఉప ప్రధానిగా పనిచేశారు) ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తుండగా, సీనియర్ నేతలు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా యువ నాయకులే. ఇప్పుడు సాగుతున్న ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ‘వ్యవస్థ కుప్పకూలింది. పాత రూపంలోనే మళ్లీ నిలబడుతుందా? లేక కొత్త రూపం ఏమన్నా తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే’ అని పౌడెల్ చెప్పారు. ప్రభుత్వం సూచించే పరిష్కారాలు ఏవైనా ఈ యువ నాయకులు ఆమోదిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా చర్చల ద్వారానే సాధ్యమని చెప్పారు.
ఇండియా–నేపాల్ సరిహద్దులో హై అలర్ట్
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్ల నేపథ్యంలో భారత్–నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సైతం తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నేపాల్ అధికార పక్షానికి చెందిన అనేక మంది కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో ఉన్నారన్న సమాచారంతో నిరసనకారులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కఠ్మాండు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఇండియాలోని లక్నోలో ల్యాండ్ చేయాల్సిందిగా ఆ విమానయాన సంస్థకు ఆదేశాలు వెళ్లాయి.
మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్
భారతదేశానికి చుట్టుపక్కల పొరుగుదేశాలుగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లో సైతం ఇదే తరహా ఆందోళనలు ఆ యా ప్రభుత్వాలను కుప్పకూల్చాయి. 2024 ఆగస్ట్‌లో ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, అవినీతిని సహించలేక తిరుగుబాటు చేశారు. వీధులు అల్లకల్లోలమయ్యాయి. అనేక మంది చనిపోయారు. చివరకు ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అటు శ్రీలంకలో 2022లో ప్రజాందోళనకు తలొగ్గిన రాజపక్ష కుటుంబం.. దేశం వదిలిపారిపోయింది. శ్రీలంకలో తిరుగుబాటు అనంతరం ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు శక్తులు అధికారంలో వచ్చాయి. బంగ్లాదేశ్‌లో నోబెల్ పురస్కార గ్రహీత చేతికి దేశ సారథ్య బాధ్యతలు అప్పగించారు.