Spotless Giraffe | అత్యంత అరుదైన ఘటన.. ప్రపంచంలోనే మొట్ట మొదటి మచ్చల్లేని జిరాఫీ జననం
ప్రపంచంలో ఇదే మొదటిదని అంచనా.. Spotless Giraffe | విధాత: జంతు ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరగని ఒక అరుదైన ఘటన అమెరికా (America) లోని జూలో చోటు చేసుకుంది. సాధారణంగా జిరాఫీ (Giraffe) అంటే దాని పొడవైన మెడతో పాటు దాని శరీరంపై అందంగా అమర్చి ఉన్న మచ్చలు కూడా వెంటనే గుర్తొస్తాయి. అయితే ఇక్కడి బ్రైట్స్ జూలో ఒక జిరాఫీ.. మచ్చలు లేకుండా ఒకే రంగుతో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. ప్రపంచంలో ఇలా ఏక […]

- ప్రపంచంలో ఇదే మొదటిదని అంచనా..
Spotless Giraffe |
విధాత: జంతు ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరగని ఒక అరుదైన ఘటన అమెరికా (America) లోని జూలో చోటు చేసుకుంది. సాధారణంగా జిరాఫీ (Giraffe) అంటే దాని పొడవైన మెడతో పాటు దాని శరీరంపై అందంగా అమర్చి ఉన్న మచ్చలు కూడా వెంటనే గుర్తొస్తాయి. అయితే ఇక్కడి బ్రైట్స్ జూలో ఒక జిరాఫీ.. మచ్చలు లేకుండా ఒకే రంగుతో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. ప్రపంచంలో ఇలా ఏక రంగుతో ఉండి.. మచ్చలు లేని జిరాఫీ ఇదేనని జూ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇంకా బారసాల జరగని ఈ ఆడ జిరాఫీ పిల్ల… జులై 31న జన్మించింది. దీని రంగు గురించి జిరాఫీ నిపుణులను వాకబు చేయగా.. ఇది అరుదైన ఘటనల్లో అరుదైనదని.. ఇలాంటి జిరాఫీని తాము చూడలేదని పేర్కొన్నట్లు బ్రైట్ జూ తన ప్రకటనలో పేర్కొంది. ఆరడుగుల పొడవుతో పుట్టిన ఈ వింత జిరాఫీ (Spotless Giraffe) ప్రస్తుతం తల్లితోనే జూ సిబ్బంది పర్యవేక్షనలో ఉన్నట్లు తెలిపింది.
అంతే కాకుండా త్వరలోనే దీనిని నామకరణ మహోత్సవం కూడా చేపడతామని.. దానికి పేరును సూచించడానికి పోటీని నిర్వహించి కిపికే (యూనిక్), ఫిరాయలీ, షకీరీ, జమెల్లా అనే పేర్లను షార్ట్‌లిస్ట్ చేశామని వెల్లడించింది. వీటిని తమ ఫేస్‌బుక్ పేజీలో పోల్‌కు ఉంచామని… ఎక్కువ మంది ఆమోదం పొందిన పేరును ఫైనల్ చేస్తామని జూ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఆ మచ్చల వల్ల ఏంటి ఉపయోగం?
జిరాఫీకి ఉన్న ఆ మచ్చలు తల్లి నుంచి వారసత్వంగా వస్తాయి. సుమారుగా ప్రతి జిరాఫీకి తనదైన మచ్చల క్రమం ఉంటుంది. వీటి కింద ఉన్న రక్త కణాలు వాటి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మచ్చలు లేకుండా పుట్టిన జిరాఫీ శరీరం.. ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తుందోనని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇది ఇలా పుట్టడానికి మాత్రం ఇతమిత్థమైన కారణాన్ని ఎవరూ చెప్పలేకపోయారని జూ నిర్వాహకులు వెల్లడించారు.
అయితే ఈ వార్త అందరి దృష్టిని జిరాఫీల వైపు మళ్లించిందని వారు అభిప్రాయపడ్డారు. అడవుల నరికివేత, వేట మొదలైన చర్యల వల్ల ఈ అందమైన జీవులు ప్రమాదంలో పడ్డాయని.. వీటి సంరక్షణపై తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. గత మూడు దశాబ్దాలలోనే ప్రపంచంలో ఉన్న 40 శాతం జిరాఫీలు అంతరించిపోవడం గమనార్హం.