Telangana panchayat elections| తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. సింహభాగం సర్పంచ్ పదవులను గెలుచుకుని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది.
విధాత: తెలంగాణ గ్రామ పంచాయతీ(Telangana panchayat elections) తొలి విడత ఎన్నికల( first phase) ఫలితాలలో అధికార కాంగ్రెస్ (Congress Big Lead)పార్టీ హవా కొనసాగింది. సింహభాగం సర్పంచ్(Sarpanch) పదవులను, వార్డు స్థానాలను గెలుచుకుని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది. తొలి విడతలో 189మండలాలల్లోని 4236గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగాల్సి ఉండగా..అందులో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన వాటిలో 70శాతం వరకు అధికార కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. ఇకపోతే గురువారం ఎన్నికలు జరిగిన 3,834పంచాయతీల సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ సర్పంచ్ లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే..గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రచారంతో పాటు అధికార పార్టీగా ఉన్న వనరులు, అవకాశాల నేపథ్యంలో ఆ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని చాటుకుంది. 33జిల్లాల్లోనూ కాంగ్రెస్ పైచేయి సాధించింది. తెలంగాణ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 84.28శాతం పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏకగ్రీవ సర్పంచ్ లతో కలిపి తొలి విడతలో 4236సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగగా..వాటిలో ఇప్పటిదాక అందిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 2000కు పైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 600కి పైగా సర్పంచ్ స్థానాలను సాధించింది. బీజేపీ సైతం 77స్థానాలలో గెలుపొందింది. ఇతరులు 145స్థానాల్లో గెలుపొందారు. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు, వార్డు సభ్యుల అనుచరులు, పార్టీ శ్రేణులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తనకున్న బలమైన కేడర్ తో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టిగానే ఎదుర్కొందని చెప్పవచ్చు. గెలిచిన సర్పంచ్ స్థానాల సంఖ్యను పక్కన బెడితే ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇచ్చిన పోటీ అనేక చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా సాగడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ నియోజవర్గాల ఎమ్మెల్యేల స్థానాల్లో మెజార్టీ స్థానాలు కోల్పోయి అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్, పార్లమెంటు ఎన్నికల్లో జీరోకే పరిమితమైంది. అయినప్పటికి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ కేడర్ అగ్ర నాయకత్వం మద్దతు లేకపోయిన గ్రామాల్లో తమ అస్తిత్వం కోసం మెరుగైన పోరాటం సాగించడంతో ఆ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సంఖ్యను కట్టబెట్టింది.
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు భారీ సంఖ్యలో గెలుపొందారు. ముఖ్యంగా తండాలు, గూడెల పంచాయతీల్లో కాంగ్రెస్ అధిపత్యం ప్రదర్శించింది. అక్కడక్కడ గెలిచిన ఇండిపెండెంట్లు సైతం ఫలితాల అనంతరం గ్రామాభివృద్ది కోణంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండటం కొసమెరుపు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram