Constable Suicide | భార్య కాపురానికి రావడం లేదని కానిస్టేబుల్ ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సోమవారం రోజున పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలమన్మరణానికి పాల్పడ్డాడు.

Reported by: Subbu | Latest News | Oct 27, 2025, 4:08 pm IST
Read Time: 4 mins
Constable Suicide | భార్య కాపురానికి రావడం లేదని కానిస్టేబుల్ ఆత్మహత్య

విధాత :

కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ పోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సోమవారం రోజున పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలమన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మద్దికుంట గ్రామానికి చెందిన జీవన్ రెడ్డి (37) ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ముస్తాబాద్ మండల మెరాయిపల్లి గ్రామానికి చెందిన చందన తో జీవన్ రెడ్డికి కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు మోక్ష, కృతిక ఉన్నారు.

అయితే, గత మూడేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవల కారణంగా సంవత్సరం క్రితం చందన తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మని జీవన్ రెడ్డి ఎన్నిసార్లు అడిగినా చందన రాలేదు. ఈ క్రమంలో ఇటీవల చందన విడాకుల నోటీసులు పంపించింది. దీంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా, సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ శివారులోని అడ్లూర్ గోదాం వద్ద ఉన్న రాధస్వామి సత్సంగ ఆశ్రమం వెనుక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటువైపుగా వెళ్తున్న గొర్రెల కాపరి మృత దేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న కామారెడ్డి డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్ ఘటనాస్థలికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. కాసేపటి తరువాత జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కూడా సంఘటన స్థలికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. తరువాత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.