Supreme Court| అసెంబ్లీ బిల్లుల ఆమోదం కేసులో..కేంద్ర..రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : అసెంబ్లీ బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఏప్రిల్ లో సుప్రీం కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఎదుట పలు ప్రశ్నలు లేవనెత్తారు. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అంటూ రాష్ట్రపతి సుప్రీంకోర్టును ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 14 కీలక ప్రశ్నలను అత్యన్నత న్యాయస్థానం ముందుంచారు. ప్రజా ప్రయోజనంతో ముడిపడివున్న చట్టపరమైన అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ కోర్టు ముందు తన ప్రశ్నను ఉంచవచ్చని, సుప్రీంకోర్టు దానిపై విచారణ జరిపి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయవచ్చని 143(1) అధికరణం తెలియజేస్తోందని గుర్తు చేశారు.
బిల్లుల ఆమోదంపై కాల వ్యవధిని..కోర్టుల నిర్ధేశిత్వాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి లేవనేత్తిన అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లుల ఆమోదంపై అభిప్రాయాలు తెలియజేయాలని తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదని..మొత్తం దేశానికి సంబంధించిన విషయమని కోర్టు పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి అభిప్రాయాలు తెలియజేయాలంటే ఃవిచారణ వాయిదా వేసింది.