CM Revanth Reddy| ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. రెండేళ్ల ప్రజా పాలనా వారోత్సవాలు సందర్భంగా 12గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరుగనున్న సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా దాదాపు రూ.1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.

CM Revanth Reddy| ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరబాద్ : సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University visit) సందర్శించనున్నారు. రెండేళ్ల ప్రజా పాలనా వారోత్సవాలు సందర్భంగా 12గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరుగనున్న సభకు రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా దాదాపు రూ.1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన సముదాయం, ఇంజినీరింగ్‌ కాలేజీలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ లా భవనం తదితర అభివృద్ధి పనులకు సభా వేదిక ద్వారానే సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. సీఎం రాక నేపథ్యంలోయూనివర్సిటీలో, పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టులో యూనివర్సీటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవానికి క్యాంపస్‌కు వచ్చారు. ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శుక్రవారం ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వహించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఎంత మొత్తమైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌మ‌ని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రెండోసారి ఓయూ సందర్శన సందర్బంగా చేయబోయే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్‌ లపైన, ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకులు, పార్ట్‌ టైం అధ్యాపకుల సమస్యలపైన, బోధనేతర సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలపైప సీఎం రేవంత్ రెడ్డి సానుకూల చర్యలు ప్రకటించాలని ఆయా వర్గాలు కోరుకుంటున్నాయి.

 

సీఎం ఓయూ పర్యటనపై కవిత హాట్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్ అంటూ ట్వీట్ చేశారు. మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ తో ఇన్నాళ్లు మభ్య పెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నవ్ .. పోరాటాల పురిటి గడ్డ అది.. మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశానని చెప్తావ్.. ఉత్తుత్తి మాటలు.. జాబ్ లెస్ క్యాలెండర్ లకు కాలం చెల్లిందన్నారు. రైజింగ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు.. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలని కవిత సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.