devadula lift । మార్చి 2026 నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మార్చి 2026 నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

devadula lift । విధాత, వరంగల్ ప్రతినిధి: మార్చి 2026 నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నాడు ఏఐసీసీ అధ్యక్షురాలి హోదాలో సోనియాగాంధీ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఆమోతోనే ప్రారంభింపజేస్తామని తెలిపారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా మారనున్న దేవాదుల పూర్తయితే 60 టీఎంసీల నీటితో 300 రోజులు పారి ఇక్కడి పంటపొలాలు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. నిర్దిష్ట కాలపరిమితులను పెట్టుకుని పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.
ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ ఆటంకంగా మారిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ డిజైన్లు చేసింది కానీ భూసేకరణ జరపలేదన్నారు. ప్రాజెక్టులు ఇసుక, మట్టితో పూడిపోతున్నాయని, వాటి తొలగింపురకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మీదటనే సీడబ్ల్యూసీతో మాట్లాడి, 67 టీఎంసీల ప్రతిపాదనలు పంపామన్నారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు అవసరమైన ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. సహచర మంత్రి సీతక్క ప్రతిపాదించిన లిఫ్టుల మంజూరుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. డీ సిల్టింగ్, జంగిల్ కటింగ్ లకు 1100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నీటిపారుదల శాఖలో 700 మంది ఏఈఈలను నియమించనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 1800 మంది లష్కర్ లను నియమించనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు.