Sonia Gandhi : ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సోనియాగాంధీ ఫైర్
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై సోనియా గాంధీ మండిపడ్డారు. పేదల పథకం నిధుల్లో కేంద్రం కోత పెడుతోందని, రాష్ట్రాలపై భారం మోపుతోందని ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) గా మార్చడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మండపడ్డారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రూపురేఖలనే కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని విమర్శించారు. నిధుల్లో కోత పెట్టిందని ఆరోపించారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. నల్లచట్టంపై పోరాడేందుకు లక్షలమంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సోనియాగాంధీ స్పష్టం చేశారు.
కొత్త బిల్లుతో మారిన పథకం మార్గదర్శకాలు
ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్కీమ్‌ను రద్దు చేసింది. దాని స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) పేరుతో కొత్త బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలిపింది. ఈ చర్యను కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జీ రామ్ జీ పథకంలో కేంద్రం 5 కీలక మార్పులు చేసింది. వాటిలో ప్రధానంగా గతంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి 100 రోజుల పని దినాలను వీబీ జీ రామ్ జీ స్కీమ్‌లో 125 రోజులకు పెంచారు. దీనివల్ల కూలీలకు అదనంగా 25 రోజులు ఎక్కువగా ఉపాధి హామీ లభిస్తుంది. కొత్త స్కీమ్ ప్రకారం వ్యవసాయ సీజన్‌లో విరామం ఉంటుంది. ముఖ్యంగా విత్తు వేసే సమయంలో, కోత సమయంలో కూలీల కొరత ఏర్పడుకుండా ఉండేందుకు ఈ విరామం ఇచ్చారు. అంటే ఏడాదిలో 60 రోజుల పాటు ఈ ఉపాధి పనులు నిలిపివేస్తారు. ఈ 60 రోజుల మినహాయించి మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు పని ఉంటుంది.
రాష్ట్రాలపై ఆర్థిక భారం
గత మహాత్మగాంధీ ఉపాధి హామీ స్కీమ్‌లో కూలీల వేతనాలను కేంద్రమే పూర్తిగా భరించేది. కొత్త బిల్లు ప్రకారం కేంద్రం 60 శాతం, 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం కేంద్రం,10 శాతం రాష్ట్రాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆర్థిక భారం పెరగనుండటం గమనార్హం. కూలీల బోగస్ హాజరును నియంత్రించేందుకు కొత్త స్కీమ్‌లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు. జియో ట్యాగింగ్, ఏఐ వంటి సాంకేతికతలను వినియోగించనున్నారు. పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ‘నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్’ను ఏర్పాటు చేయనున్నారు. జి రామ్ జి స్కీమ్ పనులను ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. వాటిలో నీటి భద్రత (చెరువుల పునరుద్ధరణ వంటివి), గ్రామీణ మౌలిక సదుపాయాలు (రోడ్లు, కనెక్టివిటీ), జీవనోపాధి వనరులు (స్టోరేజ్ హౌస్‌లు, మార్కెట్లు), విపత్తు నిరోధక పనులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ
England vs Australia : యాషెస్..మూడో టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram