National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు..సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఈడీ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించడాన్ని హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది.
విధాత, హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది.
ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీల్ పై స్పందన కోరుతూ సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే మార్చి 12 వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని, సాక్ష్యాలను సేకరించిందని, కేసులో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా జరిపిందని తెలిపారు. ఈడీ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోకుండా దిగువ కోర్టు తప్పు చేసిందని వాదించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు గత మంగళవారంనాడు నిరాకరించింది. చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేటు వక్తి సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోలేమని చట్టం ప్రకారం దీన్ని విచారించడం సాధ్యం కాదని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తీర్పునిచ్చారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ చార్జిషీటు ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈడీ ఛార్జిషీట్లులో సోనియగాంధీ, రాహుల్ గాంధీ పేర్లతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారి పేర్లు చేర్చింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు ఏజేఎల్ అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. ప్రతిగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. యంగ్ ఇండియా సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సూమారు. రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram