Digital Media Accreditation : తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్..కొత్త అక్రిడిటేషన్ల జారీకి జీవో విడుదల
తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
విధాత : తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ విధానాన్ని సమగ్రంగా పునఃసమీక్షిస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను విడుదల చేసింది. తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ నిబంధనలు –2025 పేరిట సాధారణ పరిపాలన (సమాచార, ప్రజా సంబంధాల శాఖ) జీవో ఎంఎస్ నంబర్ 252ను సోమవారం జారీ చేసింది. నూతన నిబంధనలు జీవో జారీ చేసిన తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న 2016 నాటి అక్రెడిటేషన్ నిబంధనలను తాజీ జీవోతో రద్దు చేశారు. తాజా మార్పులకు అనుగుణంగా కొత్త నిబంధనలు రూపొందించారు. కొత్త కార్డులు జారీ అయ్యేంత వరకూ ఇప్పటి వరకూ ఉన్నవి కొనసాగుతాయి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు
కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయిలో స్టేట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (SMAC), ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (DMAC) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్లు ఎస్‌మాక్ ద్వారా, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి అక్రెడిటేషన్లు డీఎమ్‌ఏసీ ద్వారా మంజూరు చేస్తారు. ఈ కమిటీల కాలపరిమితి రెండేళ్లు.
అనుభవానికి ప్రాధాన్యం
కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు అనుభవాన్ని కీలకంగా పరిగణించారు. పెద్ద దినపత్రికల ప్రతినిధులకు కనీసం 10 ఏళ్ల అనుభవం, మధ్యస్థ, చిన్న దినపత్రికలకు 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టులకు కూడా ప్రత్యేక అర్హతలు నిర్దేశించారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
అక్రెడిటేషన్, మీడియా కార్డుల స్పష్టత
అక్రెడిటేషన్ వ్యక్తిగతమని, ఇతరులకు బదిలీ చేయలేనివని నిబంధనల్లో స్పష్టం చేశారు. అక్రెడిటేషన్ కార్డు ప్రత్యేక హోదా కల్పించినట్టు కాదని పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు, ఫీల్డ్ రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు ఇస్తారు. రెండింటికీ కాలపరిమితి రెండేళ్లు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు ప్రత్యేక ప్రమాణాలు
దినపత్రికలు కనీసం ఐదు రోజుల ప్రచురణ, 50 శాతం వార్తా కంటెంట్, పీఆర్‌జీఐ లేదా ఆర్‌ఎన్‌ఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలకు కూడా సర్క్యులేషన్, కంటెంట్ పరంగా స్పష్టమైన అర్హతలు పెట్టారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ న్యూస్ ఛానెల్స్‌కు కేంద్ర ఐఅండ్‌బీ శాఖ అనుమతి ఉండాలి. లోకల్ కేబుల్ న్యూస్ ఛానెల్స్ రోజుకు కనీసం మూడు వార్తా బులిటిన్లు ప్రసారం చేయాలి.
డిజిటల్ న్యూస్ మీడియాకు తొలిసారిగా కఠినమైన ప్రమాణాలు విధించారు. వెబ్‌సైట్ కనీసం ఏడాది పనిచేసి ఉండాలి. గత ఆరు నెలలుగా నెలకు కనీసం 5 లక్షల యూనిక్ విజిటర్లు ఉండాలి. డిజిటల్ మీడియాలో గరిష్టంగా 10 అక్రిడిటేషన్ కార్డులకే పరిమితి విధించారు. న్యూస్ అగ్రిగేటర్లకు అక్రిడిటేషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు.
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్రిడిటేషన్ రద్దు, అప్పీల్ అవకాశం
తప్పుడు సమాచారం ఇవ్వడం, అనైతిక ప్రవర్తన, నేరాలకు పాల్పడినట్టు తేలితే అక్రిడిటేషన్‌ను నిలిపివేయడం లేదా రద్దు చేసే అధికారం కమిటీలకు ఉంది. అక్రిడిటేషన్ తిరస్కరణ లేదా రద్దుపై జిల్లా స్థాయిలో కమిషనర్‌కు, రాష్ట్ర స్థాయిలో ఐఅండ్‌పీఆర్ శాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
అమలు బాధ్యత ఐఅండ్‌పీఆర్ శాఖదే
నూతన నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అక్రిడిటేషన్ అంశాల్లో ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయమని జీఓలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :
తెలంగాణ జర్నలిస్టులకు గుడ్ న్యూస్..కొత్త అక్రిడిటేషన్ల జారీకి జీవో విడుదల
95 Year Old Sarpanch : పంచాయతీ పాలకుడిగా మాజీ మంత్రి తండ్రి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram