real estate । పేద, మధ్యతరగతి వర్గాలకు భూమి ఎందుకు దక్కడం లేదు?

బెంగళూరు, ముంబై, శ్రీశైలం, వరంగల్, విజయవాడ హైవేలకు ఆనుకొని ఉన్న భూములు దాదాపు 70 శాతానికి పైగా వెంచర్లుగా మారాయి. ఇవి కాకుండా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేశాయి.

real estate । పేద, మధ్యతరగతి వర్గాలకు భూమి ఎందుకు దక్కడం లేదు?
  • స‌ర‌ళీకృత‌ విధానాలతో చేజారుతున్న పేదోడి భూములు!
  • పెట్టుబడుల పేరుతో బాడా కంపెనీలకు కట్టబెడుతున్న పాలకులు
  • అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఎత్తి వేసిన గత ప్రభుత్వాలు
  • కంపెనీల పేరుతో ఎన్ని ఎకరాలైనా కొనుగోలు చేసే అవకాశం
  • హైదరాబాద్‌ చుట్టూ భారీగా వెలుస్తున్న వెంచర్లు
  • ఎకరాల్లో భూములు అమ్ముకుని.. గజాలకు పరిమితమవుతున్న రైతులు

real estate । భూమి ఒకసెంటిమెంట్ (sentiment).. ప్రతి ఒక్కరు గుంటెడు జాగైనా తమకు ఉండాలని కోరుకుంటారు. భూమిని (land) తల్లిగా, ఆత్మగౌరవ సూచకంగా భారతీయులు భావిస్తారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా తమ భూమిని అమ్ముకోవడానికి సిద్ధపడరు. పైగా ఏ మాత్రం ఆదాయం వచ్చినా సెంటు భూమైనా కొనుక్కోవాలని చూస్తారు. పట్టణాల్లో అయితే సొంత ఇంటి కోసం గజం జాగా అయినా కావాలని కోరుకుంటారు. కానీ.. తల్లిలా భావిస్తున్న భూమికి సగటు పేద, మధ్య తరగతి ప్రజలు (middle class) క్రమంగా దూరం అవుతున్నారు. పాలకులు అమలు చేస్తున్న స‌ర‌ళీకృత‌ విధానాలు పేదల కొంప ముంచుతున్నాయి. ఫలితంగా భూమి వ్యాపార వస్తువైంది (commodity). పెట్టుబడులు పెడుతున్నామని చెపుతున్న కంపెనీలు భారీ ఎత్తున పేదల నుంచి అయిన కాడికి దండుకుంటున్నాయి. ఒక్కో కంపెనీ వేల ఎకరాల భూములను ఇప్పటికే తెలంగాణలో కొనుగోలు చేశాయి. క్రమంగా తెలంగాణ ప్రజల చేతుల నుంచి భూములు చే జారుతున్నాయి.

అధిక ధరల ఆశ

హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల మేరకు వేల ఎకరాల వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా (real estate ventures) మార్చారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, శ్రీశైలం, వరంగల్, విజయవాడ హైవేలకు ఆనుకొని ఉన్న భూములు దాదాపు 70 శాతానికి పైగా వెంచర్లుగా మారాయి. ఇవి కాకుండా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు (multinational companies) రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేశాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులు ఇక్కడ కంపెనీల పేరుతో అడ్డగోలుగా భూముల కొనుగోళ్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల కొనుగోళ్లపై (regulations on land purchases) గతంలో ఉన్న నిబంధనలు ఎత్తివేయడంతో ఎక్కవ శాతం పరాధీనం అయ్యాయి. సహజంగా తెలంగాణ భూములు మెట్ట ప్రాంతంలో ఉంటాయి. ఎక్కువగా వర్షాధారపు పంటలపైనే రైతులు ఆధారపడే వారు. పండించిన పంటలు రైతన్నల అవసరాలను తీర్చలేక పోతున్నాయి. దీంతో వివిధ కంపెనీలు ఈ మెట్ట భూములకు ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోళ్లు చేస్తుండడంతో అధికంగా డబ్బులు వస్తున్నాయని తెగనమ్ముకుంటున్నారు. రైతుల (Farmers) నుంచి కొనుగోలు చేసిన ఆయా కంపెనీలు ఆ తరువాత గజం భూమిని వేలల్లో రేటు నిర్ణయించి అమ్ముకొని అధిక లాభాలు దండుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల (Raviryala) గ్రామంలోని 75 శాతం భూమిలో వెంచర్లు, విల్లాలు, వచ్చాయని, కేవలం 25 శాతం భూమిలో మాత్రమే వ్యవసాయం జరుగుతుందని ఈ గ్రామానికి చెందిన అశ్వథరెడ్డి అన్నారు. అర్బనైజేషన్‌ (urbanization) పేరుతో వెంచర్లు, పెద్ద పెద్ద ల్యాండ్ పార్సిళ్లుగా భూమి ఎప్పుడో చేతులు మారిందని చెపుతున్నారు.

రేటు పెరుగుతుందన్న సంతోషమే కానీ..

భూముల రేట్లు లక్షలు, కోట్లలో ఉందని సంతోషపడుతున్న పాలకులు, తెలంగాణ ప్రజల చేతుల్లో నుంచి భూమి వెళ్లిపోతుందన్న వాస్తవాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు. బీఆరెస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న భూముల రేట్లు ఆంధ్రాలో లేవని చెప్పారు. కానీ అదే ఆంధ్రాలో (Andhra) భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. రెండు పంటలు పండిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. అదే తెలంగాణ ప్రజలు భూములు అమ్ముకొని వచ్చిన సొమ్ముతో అమ్ముకున్న భూముల్లో వెలిసిన వెంచర్లలో ఆ డబ్బులన్నీ పెట్టి ప్లాటు కొనుక్కొని ఉంటున్నారు. ఇలా ఎకరాల భూమి ఉన్న రైతులు గజాల భూమిలోకి మారుతున్నాడు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని సంతోష పడుతారా? లేక భూమి లేకుండా పోతుందని బాధపడుతారా? అని నరసింహారెడ్డి అనే ఒక భూ యజమాని తన బాధను వ్యక్తం చేశాడు.

అధిక ధరల ఆశకు చిన్న రైతులే (Small farmers) మొదట బలవుతున్నారు. ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్న చిన్నపాటి రైతులు తమ భూమి అమ్మితే కనీసం కోటి రూపాయల పైన వస్తుందన్న ఆశతో అమ్ముకొని అవసరుల తీర్చుకుంటున్నాడు. ఆ తరువాత భూమి లేక, ఉపాధి (employment) లేక తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

తెలంగాణ లో భూములు కొనాలకుంటే గతంలో తెలంగాణ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కానీ కాలక్రమేణా బోర్డు లేకుండా చేశారు. అలాగే పీవీ నరసింహారావు (PV Narasimha Rao) ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అందరికీ భూములు ఉండాలన్న ఉద్దేశంతో సీలింగ్ చట్టం (Ceiling Act) తీసుకువచ్చారు. పట్టణాల్లో 11 వందల గజాల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి 54 ఎకరాల వరకు పరిమితం చేశారు. వందల ఎకరాల భూ స్వాముల భూములను స్వాధీనం చేసుకొని సీలింగ్ భూములను పేదలకు పంచారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు, దళితులకు అసైన్ (assigned) చేశారు.

కాల క్రమేణా సీలింగ్ చట్టం లక్ష్యం నీరుకారి పోతున్నది. పట్టణాలలో భవన నిర్మాణాలు పెంచాలనే పేరిట, కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు నిర్మించడానికి అవకాశం కల్పిస్తున్నామనే పేరిట అర్బన్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. గతంలో అర్బన్ సీలింగ్ చట్టం (Urban Ceiling Act) వల్ల అనేక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించింది. హౌసింగ్ బోర్డుకు స్థలాలు బదిలీ చేసి మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు నిర్మించి తక్కువ ధరకు విక్రయించింది. ఇలా అనేక చోట్ల హౌసింగ్ బోర్డు కాలనీలు (Housing board colonies) వెలిశాయి కూడా. కానీ సీలింగ్ చట్టాన్ని ఎత్తి వేయడంతో పట్టణ ప్రాంతంలో ఉన్న వందల ఎకరాల భూములు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీల (corporate real estate companies) చేతుల్లోకి వెళ్లాయి. బడా బాబులు ఆయా భూముల్లో అడ్డగోలుగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నగరంలో చాలా మంది ప్రజలకు కనీసం 70 గజాల ఇంటి స్థలం కూడా లేదన్నది వాస్తవం. అనేక మంది అద్దె ఇళ్లలోనే తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు.

మహానగరానికి అనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తే వందల ఎకరాల భూములు ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లాయి. రైతుల చేతుల్లో భూమి లేకుండా పోయింది. ఏదో ఒకరిద్దరు పెద్ద రైతులు మినహాయించి చిన్న, సన్న కారు రైతుల నుంచి భూములు చేజారాయి. వ్యవసాయ భూములకు (agricultural lands) అమలులో ఉన్న సీలింగ్ చట్టం నిర్వీర్యమైంది. దీనిని పకడ్బందీగా అమలు చేయాలన్న ఆలోచనలో సర్కారు పెద్దలు లేనట్లు కనిపిస్తోంది. పార్టీ ఏదైనా సర్కారులో ఉన్న వారంతా క్రమంగా ఈ చట్టాన్ని నీరు కారుస్తున్న తీరే కనిపిస్తోంది. వ్యక్తుల పేర్లతో వ్యవసాయ భూముల కొనుగోలుకు సీలింగ్ ఉండటంతో కంపెనీలు, ఫర్మ్స్‌ పేరుతో వందల ఎకరాల భూములు కొనేస్తున్నారు. కంపెనీల పేరుతో కొనే భూములకు సీలింగ్ చట్టం వర్తించక పోవడంతో అనేక మంది కంపెనీలు రిజిస్టర్‌ చేసుకొని వందలు, వేల ఎకరాల భూములు కొనుగోలు చేయడం గమనార్హం. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరుగదు.. దీంతో రోజు రోజుకు భూమిని లేని వారి సంఖ్య పెరుగుతున్నది. అలాగే కంపెనీల పేరుతో నయా భూస్వాములు తెలంగాణలో జొరబడ్డారు. ఇలా వందల ఎకరాలు కొన్న బడా బాబులు వెంచర్లు చేయడం, ఫామ్ హౌజ్ లు నిర్మించుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి కొంత మంది వ్యవసాయ భూములను అలాగే బీళ్లు పెడుతున్నారు. ఫలితంగా కూరగాయలు, ఇతర ధాన్యాలు పండించడం తగ్గుతోంది. వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేయడంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకులను అధిక ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు తమకున్న కొద్ది పాటి భూమిని అమ్ముకున్న పేద రైతులు తిరిగి కూలీలుగా మారుతున్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతున్నదని యాదయ్య అనే పేద రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.