గుడ్ న్యూస్..హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో ఫ్రీ జర్నీ!

రాష్ట్ర ప్రజలకు, రాజధాని వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించబోతుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లలో జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం అమలుకు నిర్ణయించింది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

గుడ్ న్యూస్..హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో ఫ్రీ జర్నీ!

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు, రాజధాని వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించబోతుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లలో జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం అమలుకు నిర్ణయించింది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. నగరంలో ట్రాఫిక్, కాలుష్యం సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం రైల్వే బోర్డు అనుమతి కోరింది. ఉచిత ప్రయాణంతో రైల్వే శాఖకు వచ్చే ఆదాయ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అమలుకు ముందు రైల్వే బోర్డు నుండి తుది ఆమోదం ఇంకా రావలసి ఉంది.

ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఉచిత ప్రయాణంతో వచ్చే ఆదాయం లోటును ప్రభుత్వం రైల్వే శాఖకు చెల్లించనుంది. ప్రస్తుతం ఏడాదికి ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు రూ. 10కోట్ల మేరకు ఆదాయం వస్తుందని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా సమాచారం. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలో నగర వాసులు, ఉద్యోగులు ప్రయాణించేందుకు వీలుగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ఆర్టీసీ షటిల్ బస్సులు కూడా నడిపేందుకు సిద్దం అవుతుంది. ఈ పథకం అమలైతే రైల్వే శాఖకు కూడా స్థిరమైన ఆదాయం లభించే వెసులుబాటు దక్కనుంది.

ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంఎంటీఎస్ ఉచిత రైలు ప్రయాణం అమలు చేస్తే అది మరో కొత్త పథకంగా నిలవనుంది. జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల ఎన్నికల వేళ అధికార పార్టీకి ఈ నిర్ణయం రాజకీయంగా కూడా మేలు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఎంఎంటీఎస్ సర్వీసులు రోజుకు సుమారు 38,000 నుండి 42,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్తున్నాయి. కోవిడ్‌కు ముందు రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించే ఎంఎంటీఎస్‌లో ప్రస్తుతం సరైన ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల ఆ సంఖ్య 40 వేల లోపుకు పడిపోయింది. ప్రస్తుతం కేవలం 80 నుంచి 88 రైలు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకల సంఖ్య తగ్గడం, సమయపాలన సరిగ్గా లేకపోవడం వంటివి ప్రయాణికుల సంఖ్యపై ప్రభావం చూపాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు మరింత అందుబాటులో రైళ్లను తీసుకొచ్చేందుకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాశారు. రద్దీ సమయాల్లో రైళ్ల రాకపోకలను మెరుగుపరచాలని, సమయపాలనను మెరుగుపరచాలని, స్టేషన్ సౌకర్యాలను ఉన్నతీకరించాలని, ఆర్టీసీ షటిల్ బస్సుల ద్వారా చివరి మైలు కనెక్టివిటీ కల్పించాలని కోరారు. ఇందుకోసం స్టేషన్లలో స్థలాన్ని కేటాయించాలని కూడా అభ్యర్థించారు.

ఎంఎంటీఎస్ ఉచిత రైలు ప్రయాణం పథకం ఆమోదం కోసం ఒక ముసాయిదా అవగాహన ఒప్పందం(MoU)ను సమర్పించవలసిందిగా దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రైళ్ల సంఖ్య, వాటి సమయాలకు సంబంధించిన నిర్ణయాలు రైల్వే నియంత్రణలోనే ఉంటాయని, అయితే మౌలిక సదుపాయాల మెరుగుదలలు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే జరుగుతాయని కూడా అది స్పష్టం చేసింది.