Hydra rescue Park | కొండాపూర్‌లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. రూ.30 కోట్ల స్థలం సేఫ్!

పార్కును క‌బ్జా చేసి.. బై నంబ‌ర్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. కొండాపూర్‌లాంటి ఖ‌రీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గ‌జాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని రాఘ‌వేంద్ర కాల‌నీలో పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గ‌జాల‌ను లే ఔట్‌లో చూపించారు

Hydra rescue Park | కొండాపూర్‌లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. రూ.30 కోట్ల స్థలం సేఫ్!

విధాత, హైదరాబాద్ :
పార్కును క‌బ్జా చేసి.. బై నంబ‌ర్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. కొండాపూర్‌లాంటి ఖ‌రీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గ‌జాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని రాఘ‌వేంద్ర కాల‌నీలో పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గ‌జాల‌ను లే ఔట్‌లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా క‌నిపించ‌డంతో అక్కడ కొంత‌మంది క‌బ్జాకు ప్రయ‌త్నించారు. బై నంబ‌ర్లు సృష్టించి 10 ప్లాట్లు రెడీ చేసి ప్రతి ప్లాట్ లోనూ ఒక షెడ్డు వేశారు. ఈ విష‌య‌మై రాఘ‌వేంద్ర కాల‌నీ సి బ్లాక్‌ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేష‌న్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల‌తో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు ఆక్రమణల‌ను శుక్రవారం తొల‌గించారు. ఆ వెంట‌నే స్థలం చుట్టూ హ్రైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. పార్కును హైడ్రా కాపాడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలం విలువ దాదాపు రూ. 30 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. 200ల గ‌జాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబ‌ర్లు సృష్టించి క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా.. వాటిని రెగ్యుల‌రైజ్ కూడా చేసుకున్నారు. భ‌వ‌న నిర్మాణానికి అనుమతులు కూడా మంజూర‌య్యాయి. ఇంత‌లో హైకోర్టు ఆదేశాల‌తో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను జీహెచ్ ఎంసీ వెన‌క్కి తీసుకుంది. అలాగే రెగ్యుల‌రైజేష‌న్‌ను కూడా ర‌ద్దు చేసింది.