IRCTC Divya Dakshin Yatra | అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ వివరాలివే!

IRCTC Divya Dakshin Yatra | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. మే 24న హైదరాబాద్‌లో ఈ దివ్య దక్షిణ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం దర్శించుకుంటారు.

IRCTC Divya Dakshin Yatra | అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ వివరాలివే!

IRCTC Divya Dakshin Yatra | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం – చిదంబరం పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ( Bharat Gaurav Tourist Train ) ద్వారా ఈ పర్యటన ప్యాకేజీని రూపొందించింది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు జరిగే ఈ టూర్ మే 24వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.

మే 24వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవ్వగా.. ఈ పర్యటనలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. తిరిగి మే 31వ తేదీన తిరిగి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ పర్యటనలో స్లీపర్, 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించారు. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్‌కు రూ.14,500; 3 టైర్ ఏసీకి రూ.21,700; 2 టైర్ ఏసీకి రూ.27,900గా ధర నిర్ణయించారు. ఐదు నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ధరలు ఉంటాయి.

ఈ టూర్ ప్యాకేజిలో దర్శించబోయే పుణ్యక్షేత్రాలు

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్రలో భాగంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్ ప్యాకేజీని రూపొందించారు. ఈ పర్యటనలో ఈ కింది ఆలయాలను దర్శించుకుంటారు.

* తిరువణ్నామలై – అరుణాచలేశ్వర స్వామి ఆలయం
* రామేశ్వరం – రామనాథస్వామి ఆలయం
* మదురై – మీనాక్షి అమ్మవారి ఆలయం
* కన్యాకుమారి – కుమారి అమ్మన్ ఆలయం
* తిరుచ్చి – శ్రీ రంగనాథ స్వామి ఆలయం
* తంజావూరు – బృహదీశ్వర ఆలయం
* చిదంబరం – నటరాజ స్వామి ఆలయం

షెడ్యూల్ ఇదీ..

మొదటి రోజు: మే 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయల్దేరుతుంది. మార్గమధ్యలో జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది.

రెండో రోజు : ఉదయం 9.15 గంటల వరకు తిరువణ్నామలై చేరుకుంటారు. ముందుగా హోటల్‌కు వెళ్లి స్నానం, కాలకృత్యాలు తీర్చుకుంటారు. అనంతరం అరుణాలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి 10 గంటలకు తిరువణ్నామలై నుంచి రామేశ్వరం బయల్దేరతారు.

మూడో రోజు: ఉదయం 8 గంటలకు కుడల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం వెళ్తారు. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత రామేశ్వరం ఆలయంతో పాటు ఇతర ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రికి రామేశ్వరంలోనే బస చేస్తారు.

నాలుగో రోజు: రామేశ్వరం నుంచి మదురైకి బస్సులో వెళ్తారు. అక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. సాయంత్రం షాపింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత తిరిగి కుడల్ నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 11.30 గంటలకు కన్యాకుమారి/నాగర్‌సోల్ బయల్దేరి వెళ్తారు.

ఐదో రోజు: తెల్లవారుజామున 5 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాక రాక్ మెమోరియల్, గాంధీ మండపం సందర్శిస్తారు. సాయంత్రం సముద్ర తీరాన అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. అనంతరం కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరి తిరుచ్చికి బయల్దేరతారు.

ఆరో రోజు: ఉదయం 8 గంటలకు తిరుచ్చి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఫ్రెషప్ అయ్యాక రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తంజావూరు వెళ్లి బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఏడో రోజు: మధ్యాహ్నం ఒంటి గంటకు చిదంబరం చేరుకుని నటరాజ స్వామి ఆలయాన్ని దర్శి్స్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఎనిమిదో రోజు: మే 31వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

  • రైలు ప్రయాణం
  • హోటల్ వసతి
  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం
  • దర్శనాలకు రవాణా
  • టూర్ ఎస్కార్ట్ సేవలు
  • ప్రయాణ బీమా

ప్యాకేజీలో లేని సదుపాయాలు

  • ఆలయ ప్రవేశ టికెట్లు
  • వ్యక్తిగత ఖర్చులు
  • గైడ్ ఖర్చులు

ముఖ్యమైన నిబంధనలు

  • ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు లేదా ఇతర ఫొటో ఐడీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి
  • రైలు సమయాలు పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంటుంది.
  • ప్రయాణ సమయానికి ముందే చేరుకోవాలి
  • ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే యాత్ర షెడ్యూల్‌ను మార్చే హక్కు ఐఆర్‌సీటీసీకి ఉంటుంది.

Read More:

IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ