ఈ నెల 25న తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సి.పి.ఎస్., పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం 25న నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

విధాత: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సి.పి.ఎస్., పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం 25న నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 25 వ తేదీ ఆదివారం ఉదయం11 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నిబద్ధతగల యదార్థ వాదులైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సి.పి.ఎస్., పెన్షన్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలందరూ తప్పక హాజరు కావాలని లచ్చిరెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కార్మికుల హక్కులు హరించినా నోరు మెదపని నాయకులు, నిరంకుశ 317 జీవో వల్ల 17 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే కనీసం స్పందించని కొంత మంది నేతలా జేఏసీ గురించి మాట్లాడేదన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాలను, సంఘాల నేతలను ఉక్కుపాదంతో అణిచివేసినప్పుడు మాట్లాడనివారు, మొదటి తేదీన ఇవ్వాల్సిన జీతాలను నెల పొడవునా పదేళ్ల పాటు ఇచ్చినప్పుడు, వెంటనే ఇవ్వాల్సిన 3 డీఏలను ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంచినప్పుడు, మూడు నెలల్లో పిఆర్సీ ఇస్తామని చెప్పి, మూడు సంవత్సరాల పాటు జాప్యం చేసి, ముష్టి 5% ఫిట్ మెంట్ ఇస్తే నోరు విప్పని, పిఆర్సీ బకాయిలను 18 వాయిదాలలో చెల్లిస్తామని రెండు వాయిదాలు చెల్లించి ఉద్యోగులను దగ చేసినప్పుడు ఉలుకు, పలుకు లేకుండా ఉన్న నేతలకు జేఏసీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. జనరంజక పాలన మరియు వ్యవస్థకు జీవనాడిగా ఉండే రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, వీఆర్వో , వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి, ఇతర డిపార్ట్మెంట్లను సైతం ఉనికి లేకుండా చేసినప్పుడు, విస్తరించ వలసిన శాఖలను కుదించి, ఉద్యోగులను రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు ఎక్కడుంది జేఏసీ? ఏం చేశారు జేఏసీ నాయకులు అని అన్నారు.
ఇప్పుడు ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం, ఇతర డిమాండ్ల కోసం జేఏసీ అంటున్నారని, అసలు దీన్ని ఎవరి ప్రొధ్భలంతో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో, ఎవరి మెప్పు కోసం ఏర్పాటు చేశారో ఉద్యోగులు/ఉపాధ్యాయులు /కార్మికులు మరియు పెన్షనర్లు గుర్తించలేని స్థితిలో ఉన్నారా ఒకసారి ఆలోచించండి? అని లచ్చిరెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సాధకబాధకాలపై సంపూర్ణ అవగాహన కలిగి, చొరవతో వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం సుసాధ్యం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని బద్నాం చేసే కుట్రలు కావా? అని అన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై కొందరు తమ స్వార్థ, సొంత, సంకుచిత ప్రయోజనాల కోసం JAC ముసుగులో కార్యాచరణ అంటూ తప్పుడు ఆరోపణలు చేయడంలో వీరి యొక్క విశ్వసనీయత ఎంతటిదో ఇట్టే తెలిసిపోతుందన్నారు.
ఇలాంటి స్వార్థ, సంకుచిత, రహస్య రాజకీయ ప్రయోజనాల కోసం కుయుక్తులు పన్నుతున్నా వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా?, పరిస్థితుల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల సమస్యలు సానుకూలంగా పరిష్కారించుకోవడానికి తెలంగాణలోని అన్ని శాఖల యూనియన్ నాయకులు ఏకతాటిపైకి రావాల్సిన సందర్భం , అనివార్యత ఏర్పడిందని లచ్చిరెడ్డి అన్నారు.
ఉద్యోగులు ఆలోచించండి
గత పది సంవత్సరాలుగా నిరంకుశ, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాతూ అనేక నిర్బంధాలు, అడుగడుగునా అవమానాలు, అణిచివేతలకు గురైన వారికి జెఎసి ఏర్పాటు చేసే హక్కుందా? ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, గత పదేళ్లుగా సకల సంపదలు, రాజభోగాలు అనుభవిస్తూ విందులు, వినోదాలు, గత ఎన్నికల్లో గడపగడపకు వెళ్లి రాక్షస ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని జెండాను పట్టుకొని తిరిగిన వారికి జెఎసి ఏర్పాటు చేసే హక్కుందా? విజ్ఞులైన ఉద్యోగ, పెన్షనర్ల సమాజం ఆలోచించాలని లచ్చిరెడ్డి ఉద్యోగులను కోరారు. స్వార్థ సంకుచిత రహస్య ఎజెండా నాయకులను వ్యతిరేకించాలని లచ్చిరెడ్డి పిలుపు ఇచ్చారు.