విధాత : మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి షాక్ ఇచ్చింది. జగిత్యాల మున్సిపాల్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వాణిని ఎంపిక చేసింది. వైస్ చైర్ పర్సన్ పదవిని జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. అధిష్టానం నిర్ణయం జీవన్ రెడ్డిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్న నేపథ్యంలో నేడు జరిగే చైర్ పర్సన్ ఎన్నికల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే మున్సిపాల్టీ చైర్ పర్సన్ పదవిని సంజయ్ వర్గానికి వదిలేస్తే..జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్ పదవిని జీవన్ రెడ్డి వర్గానికి అప్పగిస్తామన్న షరతుతో ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తుంది. అటు సంజయ్ ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ బీ ఫాం మీద గెలుపొందిన వారితో పాటు, స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిపి 23 మందితో క్యాంపు నిర్వహించారు. తన వర్గంలోని 14 మంది కౌన్సిలర్లతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్యాంపు వేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 కౌన్సిలర్ స్థానాలను, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఎంఐఎం 2, ఇతరులు 15మంది విజయం సాధించారు. జగిత్యాలలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న తనను కాదని, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కి ప్రాధాన్యత నిస్తుండటం పట్ల జీవన్ రెడ్డి ఏఐసీసీ సెక్రెటరీ సవాంగ్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ఇచ్చిన 16బీ ఫారంలలో 9 మందిని గెలిపించుకున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్లుగా గెలిచారన్నారు. సంజయ్ కి 34 బీ ఫారంలు ఇస్తే 14 గెలిచారన్న జీవన్ రెడ్డి తెలిపారు. తన మనుషులుకు టికెట్ రాకుండా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి..ఇప్పుడు చైర్ పర్సన్ పదవి కూడా సంజయ్ వర్గానికే ఇవ్వడం ఆయనకు మింగుడుపడని పరిణామంగా భావిస్తున్నారు.
